తెలంగాణలో జూన్ 19 నుంచి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత

Wait 5 sec.

తెలంగాణలో నైరుతి రుతుపవనాల గమనం సాగుతోందని రాష్ట్రమంతటా ఇవి పూర్తిగా విస్తరించడానికి మరో ఐదు రోజుల సమయం పట్టవచ్చునని వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే, బుధ, గురువారాల్లో ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే సోమవారం వికారాబాద్‌ జిల్లా రాపోలులో 4.4 సెం.మీ., నల్గొండ జిల్లా ఉరుమడ్ల లో 3.1 సెం.మీ., నాగర్‌కర్నూల్‌ జిల్లా తూడుకుర్తిలో 2.4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 54.9 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 10 శాతం లోటుతో 49.2 మి.మీ. మాత్రమే నమోదైంది.ఈ నేపథ్యంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించి ఈ నెల 19 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే వాటి ప్రభావాన్ని ముందే ఊహించి నివారణ చర్యలు చేపట్టడం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. సోమవారం ఆయన జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరద ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను ముందే గుర్తించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కలెక్టర్లు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ విపత్తుల నిర్వహణ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు వర్ష సూచన ఉంటే.. మరోవైపు ఆదిలాబాద్, ఖమ్మం వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఇంకా తగ్గలేదు. సోమవారం ఈ జిల్లాల్లో సాధారణం కంటే 4.5 నుండి 4.6 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు పెరిగాయి. నేడు కూడా ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.