ఐసిస్ అనుబంధ ఉగ్రవాద కేసులో ఖాజా మొయిద్దీన్‌ను చెన్నై ప్రత్యేక కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. భారతదేశంలో ఐసిస్ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తిగా ఎన్ఐఏ ఖాజా మొయిద్దీన్‌ను చిత్రీకరించింది. అతనిపై మోపిన ఉగ్రవాద కుట్ర ఆరోపణలను కోర్టు కొట్టేయడంతో ఎన్ఐఏకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఖాజామొయిద్దీన్‌తో పాటు అన్సార్ మీరాన్‌ను కూడా ఉగ్రవాద కుట్ర కేసులో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, సింగపూర్‌కు చెందిన హాజా ఫక్రుద్దీన్‌కు ఆశ్రయం కల్పించిన కేసులో అన్సార్‌కు నాలుగేళ్లు జైలు శిక్ష పడింది. ఖాజా మొయిద్దీన్, హాజా ఫక్రుద్దీన్ కలిసి ఐసీసీ ఉగ్ర మాడ్యూల్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ 2017లో ఈ కేసు నమోదు చేసింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పది మంది పేర్లను ఈ కేసులో చేర్చింది. నిధుల సేకరణ, శిక్షణ శిబిరాల నిర్వహణ, యువతను ప్రభావితం చేయడం వంటి కార్యకలాపాలు చేపట్టారంటూ ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. యువకులను సిరియాకు పంపించి ఐసిస్‌లో చేర్పించారని ఆరోపించింది. ఈ కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత 2018లో ఎన్ఐఏ ఖాజా మొయిద్దీన్, హాజా ఫక్రుద్దీన్, అన్సార్ మీరాన్, షకుల్ హమీద్‌పై ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే జూన్ 10న ఇచ్చిన తీర్పులో చెన్నై ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఖాజా మొయిద్దీన్, అన్సార్ మీరాన్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు నిరూపించే ఆధారాలు లేవంటూ పేర్కొంది. "ఖాజా మొయిద్దీన్, అన్సార్ మీరాన్ ఐసిస్ లేదా ఇతర ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నట్లు నిరూపించే ఆధారాలు లేవు. వారు ఐసిస్‌లో చేరేందుకు లేదా ఇతరులను నియమించేందుకు కుట్ర పన్నినట్లు నమ్మదగిన ఆధారాలు లేవు. సాక్షుల వాంగ్మూలాల్లో ఉగ్రవాదం లేదా హింసకు సంబంధించిన చర్చలు జరిగినట్లు ఎక్కడా కనిపించలేదు. కేవలం పరస్పర పరిచయాలు ఉన్నాయన్న కారణంతో కుట్ర జరిగినట్లు చెప్పలేం" అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఐసిస్ సంబంధాల కేసులో నిర్దోషిగా బయటకు వచ్చిన ఖాజా మొయిద్దీన్‌పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. 2004లో తమిళనాడు పోలీసులు నెల్లికుప్పంలో శిక్షణ శిబిరం నిర్వహించిన కేసులో ఖాజా మొయిద్దీన్‌ను అరెస్టు చేశారు. 2014లో హిందూ మున్నాని నాయకుడు కేపీ సురేశ్ కుమార్ హత్య కేసులో చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. 2017లో తమిళనాడు ఐసిస్ కుట్ర కేసులో ఎన్ఐఏ అదుపులోకి తీసుకోగా.. 2019లో బెయిల్‌పై విడుదలయ్యాడు. 2020లో ఉగ్రవాద కుట్ర ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు 2020లో మళ్లీ అరెస్టు చేశారు.