ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విద్యార్థుల సర్టిఫికెట్లు, పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లపై పుట్టుమచ్చల్ని నమోదు చేసే అంశంపై పిల్ దాఖలైంది. ఇలా విద్యార్థుల పుట్టుమచ్చలు నమోదు చేయడం వ్యక్తిగత గోప్యతను హరించడమేనని లాయర్ నాగసాత్విక్ కోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల ధ్రువీకరణ కోసం వారి ఒంటిపై పుట్టుమచ్చల వివరాలను సర్టిఫికెట్లపై ముద్రించడం రాజ్యాంగ, చట్టవిరుద్ధమన్నారు. ఈ పిల్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల గుర్తింపును ధ్రువీకరించుకోవడానికి పుట్టుమచ్చల బదులుగా.. బయోమెట్రిక్‌తో పాటుగా ఇతర ప్రత్యామ్నాయ విధానాలను వినియోగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు హైకోర్టు సూచించింది. అలాగే పుట్టుమచ్చల్ని నమోదు చేసే సమయంలో కొన్ని సూచనలు చేసింది. బాలికల ఒంటిపై పుట్టుమచ్చలు నమోదు చేసేప్పుడు మహిళా సిబ్బందిని మాత్రమే వినియోగించాలని హైకోర్టు ఆదేశించింది. బాలికలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని సూచించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ప్రభుత్వ ఎగ్జామ్స్ డైరెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. నాగసాత్విక్‌ కోర్టులో తన వాదనలు వినిపించారు. విద్యార్థుల శరీరంపై ఉండే పుట్టు మచ్చలు, ఇతర గుర్తులను నమోదు చేయడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత గోప్యత హక్కును హరించడమేనన్నారు. పుట్టుమచ్చల వివరాలను విద్యార్థుల గుర్తింపు ధ్రువీకరణ కోసం నమోదు చేస్తున్నామని విద్యాశాఖ తరఫు ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ విధానం1969 నుంచి అమల్లో ఉందన్నారు. కాలం మారిందని.. సర్జరీల ద్వారా పుట్టుమచ్చలు, ఇతర మచ్చలు తొలగిస్తున్నారని ధర్మాసనం తెలిపింది. పుట్టుమచ్చల బదులు బయోమెట్రిక్‌ విధానాన్ని అనుసరించొచ్చు కదా అని సూచించింది.విద్యార్థులకు సంబంధించి ఎప్పటి నుంచో హాల్‌టికెట్లు, సర్టిఫికెట్ల కోసం పుట్టుమచ్చల్ని నమోదు చేసేవారు. ముఖ్యంగా హాల్‌టికెట్లపై పుట్టుమచ్చల గురించి ప్రస్తావించేవారు.. పరీక్షల సమయంలో ఈ పుట్టమచ్చల్ని బట్టి అభ్యర్థిని గుర్తించేవారు. అదంతా పాత పద్దతి ఇప్పుడు బయోమెట్రిక్ వంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఏపీ హైకోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది.