జీ7 సమ్మిట్‌కి హాజరుకానున్న మోదీ.. ప్రపంచ నేతలతో కీలక భేటీ

Wait 5 sec.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లోని ఎవియన్ నగరానికి మంగళవారం చేరుకున్నారు. జీ 7 సదస్సుకు ఇవాళ ఆయన హాజరుకానున్నారు. ఈ సదస్సు కోసం విదేశీ పర్యటన చేపట్టిన ఆయన ఇప్పటికే ఫ్రాన్స్‌తో పాటు స్లోవేకియాలో పర్యటించారు. ఇక ఆయన విదేశీ పర్యటనలో చివరి రోజు భాగంగా జీ 7 సదస్సుకు హాజరుకానున్నారు. ఎవియన్ నగరానికి చేరుకున్న మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రోన్ స్వాగతం పలికారు. జీ7 సదస్సులో భాగంగా కొత్త భాగస్వామ్యాలు - అంతర్జాతీయ ఐక్యత పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే వర్కింగ్ సెషన్‌లో మోదీ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో జీ 7 నాయకులతో పాటు భాగస్వామ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సహకారం బలోపేతం, సుస్థిర అభివృద్ధిపై సాగే ఈ సమావేశంలో ప్రపంచ బ్యాక్, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. జీ 7 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ యూరప్‌లోని కీలక దేశాల ప్రధానులతో ప్రత్యేక సమావేశం కానున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో పాటు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వీళ్లతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా మోదీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీల అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఏర్పాటు చేసే గాలా డిన్నర్‌లో ప్రధాని పాల్గొంటారు. జూన్ 17న ట్రంప్ - మోదీ భేటీ జరగనుందని వైట్ హౌస్ ఇప్పటికే అధికారిక ప్రకటన జారీ చేసింది. జీ7 ముగిసన వెంటనే భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చల పురోగతిని సమీక్షించే అవకాశం ఉంది. ఇక జీ7 సదస్సులో భారత్ 13వ సారి పాల్గొంటుండగా.. ప్రధాని మోదీకి వరుసగా ఏడోసారి హాజరవుతున్నారు. జీ7 సదస్సులో ప్రధాని పాల్గొనడం భారత్‌కు ప్రపంచ వేదికపై పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా భావిస్తున్నారు.