కేంద్రం కీలక ప్రకటన.. ‌మళ్లీ విండ్‌ఫాల్ టాక్స్ పెంపు.. ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

Wait 5 sec.

: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా దేశీయంగా ఉత్పత్తి అయి.. విదేశాలకు ఎగుమతి అవుతున్న ఇంధనాలపై విధానం మళ్లీ తెచ్చిన సంగతి తెలిసిందే. తొలుత లీటరుపై స్వల్పంగా అమలు చేయగా.. తర్వాత పెంచడం, తగ్గించడం చేస్తూ వస్తోంది. ప్రతి 15 రోజులకు ఓసారి ఈ విండ్‌ఫాల్ టాక్స్‌ను సవరిస్తోంది. తాజాగా మరోసారి డీజిల్ సహా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF- విమాన ఇంధనం) పైన స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) పెంచింది. పెట్రోల్ ఎగుమతులపై మాత్రం సుంకాల్ని పెంచకుండా యథాతథంగానే ఉంచింది. ఈ మేరకు ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.డీజిల్‌పై ఎగుమతి సుంకం (విండ్‌ఫాల్ టాక్స్) అంతకుముందు లీటరుపై రూ. 13.50 గా ఉండగా.. ఇప్పుడు అది స్వల్పంగా పెరిగి రూ. 14 కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక విభాగం తాజా సుంకాల్ని సర్క్యులర్ రూపంలో జారీ చేసింది. ఇదే సమయంలో ఏటీఎఫ్‌పై మాత్రం లీటరుపై రూ. 3 చొప్పున పెంచి లీటరుకు రూ. 12.5 కు చేర్చింది. అంతకుముందు ఇది రూ. 9.50 గా ఉండేది.విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌పై SAED ని పెంచలేదు. దీంతో ప్రస్తుతం ఇక్కడ లీటరుపై రూ. 1.50 చొప్పున సుంకం పడుతుంది. దేశీయ వినియోగ పెట్రోల్, డీజిల్‌పై మాత్రం ఎక్సైజ్ సుంకాల్లో మార్పులు చేయలేదు. సవరించిన రేట్లు ఇప్పుడు 2026, జూన్ 16 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మళ్లీ జులై 1 న దీనిని సవరించే అవకాశం ఉంది.లాభాల్ని నియంత్రించేందుకు..అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ఇక్కడ విండ్‌ఫాల్ టాక్స్ విధానంలో మార్పులు చేర్పులు చేస్తుంటుంది. గతంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో తొలిసారి దీనిని తీసుకొచ్చింది. అప్పట్లో చమురు ధరలు భారీగా పెరగ్గా.. దేశీయ చమురు సంస్థలు దేశీయ వినియోగానికి కాకుండా విదేశాలకు భారీగా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాయి. వీటి లాభాలకు అడ్డుకట్ట వేసేందుకు.. దేశీయంగా వినియోగానికి అందుబాటులో ఉంచేందుకు దీనిని అమలు చేసింది.ఆ తర్వాత క్రమక్రమంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతూ రాగా.. ఈ విధానాన్ని 2024 చివర్లో పూర్తిగా తొలగించింది. కానీ పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధంతో మళ్లీ క్రూడాయిల్ ధరలు పెరగ్గా చమురు సంక్షోభం నేపథ్యంలో దీనిని మళ్లీ ఈ ఏడాది మార్చిలో తెచ్చింది. అప్పటినుంచి ప్రతి 15 రోజులకు ఓసారి మారుస్తోంది. అయితే ఇప్పుడు ఇరాన్- అమెరికా మధ్య డీల్ కుదిరిన క్రమంలో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా భారీగా తగ్గుతున్నా.. ఇక్కడ విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్రం పెంచడం గమనార్హం. Petrol Diesel Prices:ఈ విండ్‌ఫాల్ టాక్స్ విధానంలో మార్పు చేసినా.. ఇది రిటైల్ ఇంధన ధరలపై ప్రభావం చూపించదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.73 గా ఉంది. డీజిల్ లీటరుకు రూ. 103.82 పలుకుతోంది. అయితే క్రూడాయిల్ ధరలు మరింత తగ్గితే.. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించే అవకాశం ఉంది. ఇటీవల యుద్ధం సమయంలో ఇంధన ధరల్ని చమురు సంస్థలు లీటరుపై సుమారు రూ. 7.50 వరకు పెంచేశాయి.