తెలంగాణ ఊపిరితిత్తులుగా ఆ రెండు జిల్లాలు.. ఒక శాతం అడవి కూడా లేని జిల్లాలు ఇవే..

Wait 5 sec.

మనిషి అభివృద్ధి, పట్టణీకరణ అనే అంధకారంలో పడి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన పచ్చదనాన్ని నిలువునా నరికేస్తున్నాడు. రహదారుల విస్తరణ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, పారిశ్రామికీకరణ పేరిట ఏటా లక్షలాది చెట్లను గొడ్డలికి బలి ఇస్తుండటంతో పర్యావరణ సమతుల్యత దారుణంగా దెబ్బతింటోంది. కాంక్రీట్ వనాల్లా మారుతున్న నగరాల్లో పచ్చదనం కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషాదకర వాస్తవాన్ని అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తాజా నివేదిక స్పష్టంగా కళ్లముందుంచింది. తెలంగాణలోని జిల్లాల మధ్య అటవీ విస్తీర్ణంలో కనిపిస్తున్న భారీ అసమానతలు భవిష్యత్తు పర్యావరణ ముప్పునకు అద్దం పడుతున్నాయి.రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,12,122 చదరపు కిలోమీటర్లు కాగా.. అందులో 27,688 చ.కి.మీ అంటే24.05 శాతం అటవీ ప్రాంతం విస్తరించి ఉందని నివేదిక పేర్కొంది. అయితే ఈ పచ్చదనం అంతా కొన్ని జిల్లాలకే పరిమితమైంది. ఏకంగా 71.82 శాతం భూభాగం అడవులతో నిండిన ములుగు, 60.95 శాతం ఉన్న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలు ప్రస్తుతం తెలంగాణకు ఊపిరితిత్తులుగా మారాయి. వైశాల్య పరంగా చూస్తే కొత్తగూడెం అత్యధికంగా 4,311.38 చ.కి.మీ. అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. ములుగు, కొత్తగూడెంతో పాటు కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అడవులు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఇవి గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తరించి ఉండటమేనని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పట్టణీకరణ కోరల్లో చిక్కుకున్న జిల్లాల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. రాజధాని హైదరాబాద్ భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 0.80 శాతం మాత్రమే అటవీ ప్రాంతం మిగిలి ఉంది. ఇక కరీంనగర్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అక్కడ అటవీ విస్తీర్ణం కేవలం 0.15 శాతానికి పడిపోయింది. అంటే ప్రతి వెయ్యి ఎకరాల భూభాగంలో కేవలం ఒకటిన్నర ఎకరం మాత్రమే అడవి ఉందన్నమాట. జోగులాంబ గద్వాల జిల్లాలోనూ ఒక శాతం కంటే తక్కువ పచ్చదనం ఉంది. నానాటికీ అడవులు నశించిపోతుండటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడం వంటి వాతావరణ మార్పులను మనం చూస్తున్నాం. చెట్లను విచక్షణారహితంగా నరికేయడం వల్ల వన్యప్రాణులు నివాసాలు కోల్పోయి ఊళ్లపై పడుతున్నాయి. ఈ పర్యావరణ అసమతుల్యతను అరికట్టడానికి మైదాన, పట్టణ ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సామాజిక అడవుల పెంపకాన్ని చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.