ట్రంప్ మాస్టర్ ప్లాన్.. అమెరికా - ఇరాన్ డీల్ ఖరారైతే 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు?

Wait 5 sec.

అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు పూర్తయింది. తుది ఒప్పందానికి ముందు చేసిన ఓ అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ సంతకాలు చేసినట్లు అమెరికాకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారిక సంతకాలు చేయనున్నారు.. ఈ డీల్ ఖరారైతే ఇరాన్‌లో ఏకంగా 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అధికారిక సంతకాలు పూర్తయితే ముందుగా అందరూ ఎదురుచూసేది హార్మూజ్ జలసంధి ఎప్పుడు తెరుచుకుంటుందా? అని. హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించడంతో ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి వెళ్లాయి. ఈ ప్రభావం పూర్తిగా తొలగిపోవాలంటే కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం హార్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. అమెరికా శాంతి ఒప్పందం చేసుకున్నా, దాని తీరుపై ఇరాన్ ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ మాట్లాడుతూ 1953లో జరిగిన తిరుగుబాటు ఘటనల నుంచి అమెరికాపై ఇరాన్‌కు ఉన్న అవిశ్వాసం ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. అమెరికాతో ఒప్పందంపై సంతకాలు చేసే ముందు కొన్ని పర్యటనలు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. అమెరికా - ఇరాన్ ఒప్పందం కుదరినప్పటికీ లెబనాన్ ఇష్యూ అలానే ఉంది. ఇజ్రాయెల్ ఇప్పటికీ లెబనాన్‌లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లబోదని స్పష్టం చేసింది. హెజ్‌బొల్లాతో ఇప్పటికీ అక్కడ పోరాటం కొనసాగుతోంది. ఈ డీల్‌లో ఇజ్రాయెల్ భాగస్వామి కాకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా - ఇరాన్ డీల్‌కు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ లెబనాన్ సహా అన్ని చోట్ల సైనిక చర్యలను నిలిపివేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయని తెలపడం విశేషం.