తెలంగాణలో సొంతిల్లు లేని నిరుపేదల కల సాకారం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సమాజంలో అందరికంటే వెనుకబడి, కనీస ఆశ్రయం లేక గుడిసెల్లో నివసిస్తున్న అత్యంత నిరుపేద కుటుంబాలకు ఈ విడతలో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ముమ్మర కసరత్తు చేస్తోంది.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి నివేదిక కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ, పట్టణాల్లోనూ విస్తృతంగా సర్వేలు జరిపారు. ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 వేలకు పైగా కుటుంబాలు ఇప్పటికీ గుడిసెల్లోనే దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లు అధికారిక లెక్కల్లో తేలింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు గుడిసెల్లో నివసిస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన నిరుపేదలందరికీ పక్కా గృహాలను అందించేందుకు గృహనిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ప్రస్తుత రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా.. గుడిసె నివాసితులకు మొదటి వరుసలో స్థానం కల్పించేందుకు హౌసింగ్‌ కార్పొరేషన్‌ అన్ని ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ ఎంపిక ప్రక్రియను, లబ్ధిదారుల అర్హతలను స్వయంగా పరిశీలించేందుకు గృహనిర్మాణశాఖ ఉన్నతాధికారులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్‌ పర్యటించగా.. సూర్యాపేట జిల్లాలో చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్‌ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. మిగిలిన జిల్లాల్లో సూపరింటెండెంట్ ఇంజనీర్లు పర్యటించి వివరాలు సేకరించారు.ఈ పర్యటనల్లో అధికారులు ప్రధానంగా ప్రజాపాలన సర్వేలో సేకరించిన గుడిసె నివాసితుల వివరాల వాస్తవికతపై ఆరా తీశారు. దీంతో పాటు గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరై.. కేవలం బేస్‌మెంట్లు, గోడల వరకు కట్టి శ్లాబ్‌లు వేసుకోలేక ప్రత్యామ్నాయ తాత్కాలిక ఏర్పాట్లతో నివాసం ఉంటున్న ఇళ్ల లబ్ధిదారుల తాజా పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే మొదటి దశ ఇందిరమ్మ గృహాల నిర్మాణాల పురోగతిని, గత ప్రభుత్వం చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల ప్రస్తుత స్థితిగతులపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.