ఎంతకు తెగించార్రా.. ఏకంగా కలెక్టర్ సంతకమే ఫోర్జరీ.. అకౌంట్ నుంచి లక్షలు చోరీ..

Wait 5 sec.

అబ్బబ్బా.. ఏం తెలివి.. ఏం గుండె అది.. అదేదో స్కూలు ప్రోగ్రెస్ కార్డులో తండ్రి సంతకం ఫోర్జరీ చేసినట్లు.. అటెండెన్స్ కోసం పక్కవాడి సంతకం చేసినట్లు.. అంత సులువుగా ఎలా చేశావయ్యా సామీ.. అని అనుకునేలా చిత్తూరు జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం జిల్లా కలెక్టర్ సంతకమే ఫోర్జరీ చేశాడో మగానుభావుడు. అలాగని ఆయనేమీ పేరు మోసిన సైబర్ నేరగాడో.. కోడింగ్, డీకోడింగ్ తెలిసిన హైటెక్ దొంగో కాదు.. కలెక్టరేట్ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్. డబ్బు మీద ఆశపడ్డాడో, లేక అత్యవసరం ఏదైనా ఆ పని చేయించిందో తెలియదు కానీ.. జిల్లా కలెక్టర్, వైద్యాధికారి సంతకాలనే ఫోర్జరీ చేసి సుమారుగా రూ.7 లక్షలు కాజేశాడు. కాస్త ఆలస్యంగా ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..నిరంజన్ కుమార్ అనే వ్యక్తి చిత్తూరు కలెక్టరేట్ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్, వైద్యాధికారి సంతకాలను ఫోర్జరీ చేసి రూ.6.99 లక్షలు చోరీ చేశారని నిరంజన్ కుమార్ మీద కేసు నమోదైంది. ఈ విషయంపై అధికారుల ఫిర్యాదుతో చిత్తూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎలా తెలిసిందంటే..జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు సమన్వయాధికారిగా సుదర్శన్‌ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన మొబైల్ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. బ్యాంక్ అకౌంట్లో రూ.100 జమ అయ్యాయని దాని సారాంశం. అయితే వంద రూపాయలు ఎవరు పంపిస్తారు.. ఎందుకు పంపిస్తారని ఆలోచించిన ఆయన.. బ్యాంక్ అకౌంట్ చెక్ చేశారు. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు సంబంధించి జిల్లా కలెక్టర్, సమన్వయ అధికారికి జాయింట్ అకౌంట్ఉంది. ఆ అకౌంట్ నుంచి రూ.6.99 లక్షలు రెండు దఫాలుగా విత్‌డ్రా అయినట్లు గుర్తించారు.అలాగే బ్యాంకు చెక్‌ నంబర్‌ వివరాలు ఉండటంతో వాటిని పరిశీలించిన సుదర్శన్.. అసలు విషయాన్ని కనిపెట్టారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌‌గా పనిచేస్తున్న నిరంజన్‌ కుమార్‌.. కలెక్టర్, ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు సమన్వయాధికారి సంతకాలను ఫోర్జరీ చేసి ఈ డబ్బులు కాజేసినట్లు గుర్తించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. కలెక్టర్ పోలీసులకు సమాచారం అందించటంతో.. చిత్తూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టారు.