తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ట్రాఫిక్ ఈ-చలాన్లు లేదా రవాణా శాఖకు సంబంధించిన అధికారిక వాహన నోటీసులను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. కొత్త వాహన కొనుగోలుదారులు, ఇప్పటికే వాహనాలు ఉన్నవారు తమ అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా.. వారి ప్రస్తుత మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను తక్షణమే కేంద్ర ప్రభుత్వ చేసుకోవాలని రవాణా శాఖ సూచించింది. దీనివల్ల ప్రభుత్వ రికార్డుల నుంచి వచ్చే అన్ని రకాల అధికారిక సందేశాలు ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా వాహనదారులకు చేరుతాయన్నారు. చాలా మంది వాహనదారులు వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలో ఒక మొబైల్ నంబర్ ఇస్తున్నారని.. ఆ తర్వాత కాలంలో నంబర్లు లేదా ఈమెయిల్ ఐడీలు మారినప్పటికీ.. ఆ కొత్త సమాచారాన్ని వాహన్ డేటాబేస్‌లో అప్‌డేట్ చేయడం లేదని రవాణా శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. దీనివల్ల వాహన చట్టాల ఉల్లంఘనకు సంబంధించిన కీలకమైన అలర్ట్లు, కోర్టు, ఆర్టీఏ నోటీసులు అన్నీ పాత నంబర్లకే పోతున్నాయన్నారు. ఫలితంగా తమ వాహనాలపై పెండింగ్ చలాన్లు ఉన్నాయనే విషయం కూడా యజమానులకు తెలియకుండా పోతోందన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ ఈ-చలాన్లు, ఇతర అధికారిక సమాచారాన్ని ఎస్ఎమ్ఎస్, వాట్సాప్, ఈమెయిల్ ద్వారా డిజిటల్ రూపంలో పంపుతున్నట్లు చెప్పారు. అయితే, వాహన్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన కాంటాక్ట్ నంబర్లు చెల్లుబాటులో లేకపోతే.. ఈ ముఖ్యమైన సందేశాలు వాహనదారులకు చేరవు. దీనివల్ల పెండింగ్ ఫైన్లు పేరుకుపోవడమే కాకుండా.. భవిష్యత్తులో సదరు వాహనానికి సంబంధించిన బదిలీలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల పునరుద్ధరణ వంటి లావాదేవీలు నిర్వహించేటప్పుడు తీవ్రమైన చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. వాహన్ డేటాబేస్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీకి అధికారులు ఏదైనా సమాచారాన్ని పంపినట్లయితే అది చట్టపరంగా వాహన యజమానికి అధికారికంగా అందినట్లుగానే పరిగణించబడుతుందన్నారు. కాబట్టి.. మాకు నోటీసులు అందలేదు, పాత నంబర్ పని చేయడం లేదు అని వాహనదారులు చెప్పే సాకులు కోర్టుల్లో కానీ, చట్టం ముందు కానీ నిలబడవని అధికారులు తేల్చి చెబుతున్నారు. తాము సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోకపోవడం వల్ల జరిగే నష్టానికి వాహనదారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వాహనదారులు నేరుగా అధికారిక వాహన్ పోర్టల్‌ను సందర్శించి తమ వాహన వివరాలను నమోదు చేయడం ద్వారా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను సులభంగా మార్చుకోవచ్చునని అంటున్నారు. దీంతో పాటు, రవాణా శాఖ ప్రత్యేకంగా జారీ చేసిన క్యూఆర్ కోడ్‌ను తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా స్కాన్ చేయడం ద్వారా కూడా చాలా వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చునని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యం వీడి తక్షణమే తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని తెలంగాణ రవాణా శాఖ కోరింది.