: దిగ్గజ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్‌లో ఇటీవలి కాలంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అపోలోలో డిజిటల్ హెల్త్, ఫార్మసీ విభాగాన్ని ప్రత్యేకంగ అపోలో హెల్త్‌టెక్ సంస్థగా ఏర్పాటు చేసేందుకు పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో దీనిని ఐపీఓగా స్టాక్ ఎక్స్చేంజీల్లో ప్రత్యేకంగా లిస్టింగ్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే అపోలో హాస్పిటల్స్‌ బోర్డులో ప్రమోటర్ డైరెక్టర్‌గా ఉన్న శోభనా కామినేనిని అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా నియమించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు తెరపైకి వచ్చింది. అయితే ఇది గతంలోనే నమోదు కాగా.. సంస్థ తీసుకున్న చర్యలతో ఆర్బీఐ ఇక్కడ తప్పుల్ని మాఫీ చేసి జరిమానాలతో సరిపెట్టింది. >> విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద సుమారు రూ. 2424.44 కోట్ల మేర ఉల్లంఘనలకు పాల్పడింది . దీనిని తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. జరిమానాలతో కూడిన మినహాయింపులు ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఒక కాంపౌండింగ్ ఆర్డర్ (రాజీ ఉత్తర్వు) జారీ చేసింది. దీంట్లో భాగంగా ఫెమా చట్టంలోని పలు నిబంధనల కింద సంస్థ పాల్పడిన ఉల్లంఘనలన్నింటినీ మాఫీ చేసింది కేంద్ర బ్యాంకు. వన్ టైమ్ పేమెంట్ రూపంలో రూ. 17.76 కోట్ల జరిమానా విధించగా ఆ మేరకు సంస్థ పెనాల్టీ చెల్లించింది. ఇదే సమయంలో అపోలో ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు ప్రీతారెడ్డి, సునీతా రెడ్డి, ఎస్ఎం కృష్ణన్, ఎస్‌కే వెంకట్రామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్ వీరికి ఒక్కొక్కరికి రూ. 18 లక్షల చొప్పున ఫైన్ విధించగా చెల్లించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ విషయాన్ని బుధవారం వెల్లడించింది. తాజా నిర్ణయంతో ఫెమా చట్టం కింద వారికి వ్యతిరేకంగా చేపట్టిన న్యాయవిచారణ ప్రక్రియ కూడా రద్దయిపోతుంది. ఇలా ఉల్లంఘనలు మాఫీ కాకుంటే సంస్థ పలు రకాలుగా ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇది దీర్ఘకాలంలో సంస్థపై, సంస్థ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పింది. అంతకుముందు ఫెమా చట్టంలోని సెక్షన్ 15 కింద జరిగిన ఉల్లంఘనల నుంచి మాఫీ కోరుతూ.. అపోలో హాస్పిటల్స్ ఆర్బీఐకి అప్లికేషన్ పెట్టుకున్నట్లు ఈడీ తెలిపింది. ఆర్బీఐ ఈ విషయం నుంచి ఈడీని అడగ్గా చట్ట స్ఫూర్తికి లోబడి ఉల్లంఘనల మాఫీకి తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లు, దాన్ని పరిగణనలోకి తీసుకొని ఆర్బీఐ పలు ఉల్లంఘనల్ని మాఫీ చేసింది. వన్ టైమ్ పేమెంట్ కింద దీనికి అంగీకరించింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనల విషయంలో ప్రధానంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (FDI) 51 శాతం పరిమితిని మించింది. ఎఫ్‌‍డీఐ రంగంలో నిషేధించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని స్వీకరించింది. ఇలా పలు నిబంధనల ఉల్లంఘన ఇప్పుడు ఈ సంస్థపై తొలగించినట్లయింది. ఇక అపోలో హాస్పిటల్స్ షేర్లు గురువారం సెషన్‌లో స్వల్ప నష్టంతో రూ. 8412.50 వద్ద ఉంది. మార్కెట్ విలువ రూ. 1.21 లక్షల కోట్లుగా ఉంది.