నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇటీవలి కాలంలో తీవ్ర సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహం దహనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రజల మధ్య ప్రాంతీయ, రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశ్యంతోనే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు.ఈ కేసులో పట్టుబడిన నిందితుల వివరాలు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రధాన నిందితుడైన పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ సమాజంలో చదువుకున్న వ్యక్తి కావడం గమనార్హం. ఈయన ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తూ.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చైతన్యపురి ప్రాంతంలో నివాసముంటున్నాడు. అంతేకాకుండా, 2024లో జరిగిన వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అశోక్ కుమార్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఏకంగా 29 వేల ఓట్లను సాధించడం గమనార్హం. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన రెండో నిందితుడు ఎలికంటి ప్రణీత్‌గా గుర్తించారు. ఇతడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు.పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 6న తెల్లవారుజామున నిందితులిద్దరూ పక్కా వ్యూహంతో హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. తాము ప్రయాణిస్తున్న బలెనో కారు ముందుగానే సిద్ధం చేసుకున్న దుప్పట్లను తీసుకువచ్చారు. విగ్రహం చుట్టూ ఆ దుప్పట్లను పూర్తిగా కప్పి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. విగ్రహం మంటల్లో కాలిపోతుండగా వారు అక్కడి నుంచి కారులో పరారయ్యారు. ఉదయాన్నే ఈ విషయాన్ని గమనించిన మున్సిపల్ అధికారులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఆశ్రయించారు. మున్సిపల్ అధికారి ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. కారు నంబర్, మొబైల్ సిగ్నల్స్ వంటి ఆధునిక సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుల జాడను కనిపెట్టారు. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు నేరాన్ని అంగీకరించారు. సమాజంలో తీవ్ర అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన వీరి నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు.. నిందితులపై అత్యంత కఠినమైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ స్పష్టం చేశారు. ఇలాంటి శాంతిభద్రతల సమస్యలు సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు.