కోతులు, అడవి పందుల బెడదకు చెక్.. ఇదుంటే పంటలకు రక్ష, యాదాద్రి రైతుల అద్భుత విజయం

Wait 5 sec.

ఒకప్పుడు కోతులు, అడవి పందుల గుంపులు ఆ గ్రామాల్లోని రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసేవి. కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి అడవి పందులు, కోతులు పొలాలపై పడి ధ్వంసం చేసేవి. ఈ విధ్వంసం కారణంగా పెట్టుబడులు కూడా రాక రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. కానీ ఇప్పుడు ఆ రైతులకు వన్యప్రాణుల బెడద పూర్తిగా తొలగిపోయింది. సౌర విద్యుత్ కంచె సాంకేతికత వారి పంటలను కంటికి రెప్పలా కాపాడుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 30 మంది రైతులు సాధించిన ఉమ్మడి విజయమిది. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, స్థానిక స్వచ్ఛంద సంస్థల ఉమ్మడి ఆర్థిక, సాంకేతిక సహకారంతో వారు తమ పొలాల చుట్టూ ఈ సౌరకంచెలను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలోని తుర్కపల్లి, భువనగిరి మండలాల్లో కోతులు, అడవి పందుల దాడితో రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్న తరుణంలో పిలుపు అనే స్వచ్ఛంద సంస్థ ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించింది. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న దుస్థితిని సవివరంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సానుకూలంగా స్పందించిన నాబార్డు అధికారులు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ప్రాథమికంగా ప్రయోగాత్మక దశలో నలుగురు రైతులను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఒక ఎకరా భూమి చుట్టూ సౌరవిద్యుత్ కంచె ఏర్పాటు చేయడానికి మొత్తం రూ.30 వేలు ఖర్చు కాగా.. అందులో రూ.19 వేల మొత్తాన్ని నాబార్డు గ్రాంటుగా అందించింది. మిగిలిన రూ.11 వేల మొత్తాన్ని రైతులు తమ వాటా కింద భరించారు. రైతులకు కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా సోలార్ ప్యానెల్, బ్యాటరీ, ప్రత్యేక తీగలను కొనుగోలు చేసి ఇచ్చి వాటిని ఎలా నిర్వహించాలో శిక్షణ కూడా ఇచ్చారు.మొదటి విడత ప్రయోగం విజయవంతం కావడంతో.. ఆర్డీఎస్ఎస్, ఏఐడీ వంటి ఇతర స్వచ్ఛంద సంస్థలు దాతల సహాయంతో ముందుకు వచ్చాయి. వీటి సహకారంతో మరో 26 మంది రైతులు తమ పొలాలకు సౌరకంచెలను నిర్మించుకున్నారు. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 30కి చేరింది. గత యాసంగి సీజన్‌లో ఈ కంచెల రక్షణలో రైతులు ధైర్యంగా కూరగాయలు, మొక్కజొన్న పంటలను సాగు చేశారు. గత ఏడాది వన్యప్రాణుల దాడితో దెబ్బతిన్న అదే పొలాలు, ఈ ఏడాది పచ్చని పంటలతో, ఆశించిన ఫలసాయంతో కళకళలాడుతున్నాయి. తాము పండించిన పంట ఒక్క గింజ కూడా వృథా కాకుండా పూర్తిగా చేతికి దక్కుతోందని చుట్టుపక్కల గ్రామాల రైతులు సైతం తమ పొలాలకు వచ్చి ఈ సోలార్ కంచె పనితీరును ఆశ్చర్యంగా చూసి వెళ్తున్నారని కర్షలగడ్డ తండాకు చెందిన మహిళారైతు గుగులోతు శోభ ఆనందం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం వన్యప్రాణుల సమస్య తీవ్రంగా ఉంది. కోతులు, అడవి పందులు వంటి జంతువుల కారణంగా రాష్ట్రంలో ఏటా దాదాపు 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలకు భారీ నష్టం వాటిల్లుతోందని అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్న, శనగ, వేరుసెనగ, చెరకు, జొన్న, సోయాబీన్, పొద్దుతిరుగుడు, కందులు, పెసలు, రకరకాల కూరగాయల తోటలు, పండ్ల తోటలు ఈ జంతువుల దాడికి తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కేవలం పంటల నష్టమే కాకుండా.. పంటలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న రైతులపై ఇవి గుంపులుగా దాడులు చేస్తున్నాయి. ఈ తరహా దాడుల వల్ల గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో 40 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.ఈ సౌర విద్యుత్ కంచె సాంకేతికత అత్యంత సురక్షితమైనది. పొలం చుట్టూ అమర్చిన తీగలను కోతులు, అడవి పందులు తాకగానే తక్కువ తీవ్రత కలిగిన విద్యుత్ షాక్ తగిలి అవి దూరంగా పారిపోతాయి. అదే సమయంలో పొలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అలారం మోగటం వల్ల జంతువులు భయపడి ఆ పరిసరాల్లోకి రావడానికే సాహసించడం లేదు. ఈ వ్యవస్థలు పగటితో పాటు రాత్రి వేళల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. ఈ కంచెల ద్వారా వన్యప్రాణులకు ఎలాంటి ప్రాణహాని జరగదు, కేవలం అవి భయపడి దూరంగా వెళ్తాయి. గతంలో రాత్రంతా నిద్ర లేకుండా కాపలా కాసే రైతులు ఇప్పుడు కంటినిండా నిద్రపోతున్నారు. ఈ విధానం రైతులకు ఎంతో లాభదాయకంగా ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక ప్రత్యేక సోలార్ ఫెన్సింగ్ పాలసీని తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.