చిన్నారులకు చిరుతిళ్లు కొనిచ్చే తల్లిదండ్రులారా.. కాస్త అప్రమత్తంగా ఉండండి. కుర్ కురే ప్యాకెట్‌లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుని ఐదేళ్ల బాలుడు చనిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కుర్ కురే ప్యాకెట్లో వచ్చిన బొమ్మతో ఆడుకుంటూ దాన్ని నోట్లో పెట్టుకున్న ఐదేళ్ల బాలుడు.. అది గొంతులో ఇరుక్కొని పోవటంతో ఊపిరి అందక కన్నుమూశాడు. గుత్తి మున్సిపాలిటీలోని కోట వీధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని కోటలో నివశించే సాదియా, అల్తాఫ్ దంపతులకు ఫర్హాన్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఐదేళ్ల ఫర్హాన్ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో కుర్ కురే ప్యాకెట్లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. పిల్లాడు ఆడుకుంటున్నాడు కదా అని కుటుంబసభ్యులు గమనించుకోలేదు. అయితే ప్లాస్టిక్ బొమ్మతో ఆడుకుంటున్న ఫర్హాన్.. తెలిసీ తెలియని తనంతో ఆ బొమ్మను మింగాడు. దీంతో అది గొంతులో అడ్డంగా పడి ఊపిరాడక ఇబ్బందులు పడ్డాడు.ఇంతలో ఫర్హాన్‌ను గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఫర్హాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చిన్నారులకు చిరుతిళ్లు, బొమ్మలు ఇచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కుర్ కురే వంటి చిప్స్ ప్యాకేట్లలో చిన్నారులను ఆకర్షించేందుకు చిన్న సైజులలో ఉండే ప్లాస్టిక్ బొమ్మలు ఉంచుతున్నారు. దీంతో కుర్ కురే తినే సమయంలో వాటిని పిల్లలు మింగేసే ప్రమాదం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. నాణేలు, గోళీలు, బటన్లు, చిన్న ప్లాస్టిక్ బటన్లు, బ్యాటరీలు వంటి వాటికి చిన్న పిల్లలను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. స్నాక్స్ ప్యాకెట్లలో వచ్చే ప్లాస్టిక్ వస్తువులను కొని ఇచ్చిన వెంటనే తీసి పడేయాలని సూచిస్తున్నారు. అలాగే పిల్లలకు వస్తువులను నోట్లో పెట్టుకునే అలవాటు మాన్పించాలని.. ఆడుకునే సమయంలో వారిపై ఓ కన్నేసి ఉంచాలని జాగ్రత్తలు చెప్తున్నారు.