నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష పేపర్ లీకేజీ దేశం మొత్తం తీవ్ర సంచలనం రేపడంతో.. ఆ పరీక్షను రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఈసారి మరింత పకడ్బందీగా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నీట్ రీటెస్ట్‌కు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు.. ఇటీవలె పార్టీకి రాజీనామా చేసిన కే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ రీటెస్ట్‌కు సైనిక స్థాయి భద్రత, బయోమెట్రిక్ అథెంటికేషన్, ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ వంటి ఏర్పాట్లు.. ఇప్పటికే తీవ్ర పరీక్షా ఒత్తిడిలో ఉన్న విద్యార్థులపై మరింత భారం చూపుతాయని విమర్శించారు. అయితే అన్నామలై వ్యాఖ్యలను బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.నీట్ క్వశ్చన్ పేపర్ల తరలింపునకు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఎస్కార్ట్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో రవాణా.. ఏఐ నిఘాతో కూడిన 4 స్థాయిల సీసీటీవీ పర్యవేక్షణ.. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ ధృవీకరణ.. పలు దశల్లో శరీర తనిఖీలు.. ప్రధానమంత్రి కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణతో బహుళ స్థాయి నిఘా వ్యవస్థ.. ఇవి అత్యంత గోప్యమైన, సైనిక స్థాయి సాఫ్ట్‌వేర్ కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లు కావని.. ఇవన్నీ జూన్ 21వ తేదీన నిర్వహించనున్న నీట్ రీటెస్ట్ కోసం కేంద్ర విద్యాశాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లు అంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు.ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అదనపు భద్రతా చర్యలు, కఠినమైన పర్యవేక్షణను అమలు చేయడాన్ని ప్రతీ అభ్యర్థి అభినందిస్తాడని.. అయితే పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు మరింత కఠినమైన తనిఖీలు, ఎక్కువసేపు ఫ్రిస్కింగ్, అలాగే పరీక్షా సమయాన్ని 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచడం ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న విద్యార్థులపై మరింత భారం మోపుతుందని అన్నామలై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.పేపర్ లీకేజీలలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ.. నెలల తరబడి కష్టపడి నీట్ పరీక్షకు సిద్ధమైన విద్యార్థులపై ఈ చర్యలు అదనపు మానసిక ఒత్తిడిని కలిగిస్తున్న విషయాన్ని సర్కార్ పట్టించుకోవడం లేదని అన్నామలై ఆరోపించారు. ఇది మన పరీక్షా వ్యవస్థ అసలు ఉద్దేశాన్నే దెబ్బతీయడమే కాకుండా జాతీయ విద్యా విధానం - 2020 నిర్దేశించిన పరీక్షల ఒత్తిడిని తగ్గించడం అనే లక్ష్యానికి కూడా విరుద్ధంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ.. ప్రస్తుతం నీట్ అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎన్‌టీఏ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. నిర్వహణకు సవాళ్లు ఉన్నాయన్న విషయం నిజమేనని.. వాటికి అర్థవంతమైన పరిష్కారాలు అవసరమని పేర్కొన్నారు. అయితే నీట్ రీటెస్ట్ కోసం రూపొందించిన ఈ విధానం సమస్యను పూర్తిగా పరిష్కరిస్తుందనే నమ్మకం తనకు లేదని.. దీనివల్ల ప్రస్తుత సమస్యలు తగ్గకపోగా.. కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు.అయితే అన్నామలై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత వినోద్ సెల్వం ఘాటుగా స్పందించారు. బయోమెట్రిక్ అథెంటికేషన్, సీసీటీవీ నిఘా, భద్రతా తనిఖీలు పెద్ద స్థాయి పరీక్షల్లో సాధారణమేనని పేర్కొన్నారు. చైనాలో ఏటా 1.3 కోట్ల మందికి పైగా విద్యార్థులు రాసే గావ్కావో (Gaokao) ప్రవేశ పరీక్షను ఉదాహరణగా చూపిస్తూ.. దాన్ని ఎవరూ సైనికీకరణగా పిలవరని.. ప్రతిభను రక్షించే చర్యగా భావిస్తారని తెలిపారు. విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించకుండా పరీక్షా వ్యవస్థపై నమ్మకం పెంచాలని హితవు పలికారు.