తెలంగాణలోని సిరిసిల్ల చేనేత కార్మికుల కళ.. దేశ, విదేశాల్లో ఎంతో గుర్తింపును పొందింది. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షించిన సిరిసిల్ల నేతన్నలు.. ఆ తర్వాత వారి కళాఖండాలతో బాగా పాపులర్ అయ్యారు. తాజాగా సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్.. ఈ పట్టుచీరను నేశారు. బెజవాడ అమ్మవారికి బహుకరించేందుకు తయారు చేసిన ఈ చీరను ఆలయ అధికారులకు అందించారు. మంగళవారం రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన నల్ల విజయ్ కుమార్.. తన తండ్రి, ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత స్వర్గీయ నల్ల పరంధాములు స్ఫూర్తితో.. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. తాను ప్రత్యేకంగా నేసిన అత్యంత విలక్షణమైన పట్టుచీరను కనకదుర్గ అమ్మవారికి అలంకరణ చేయవల్సిందిగా.. ఆలయ ఈవో వీకే శీనా నాయక్‌కు నల్ల విజయ్ కుమార్ అందించారు. ఈ పట్టుచీరను విజయ్ కుమార్ వారం రోజుల పాటు రేయి పగలు శ్రమించి మగ్గంపై అద్భుతంగా తయారు చేశారు.ఈ అద్భుత పట్టుచీర పొడవు 5.5 మీటర్లు, 48 ఇంచుల వెడల్పు ఉంది. ఇంత భారీ పరిమాణం ఉన్నప్పటికీ.. ఆ చీర బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం మరో విశేషం. ఈ పట్టుచీరను సాంప్రదాయ, ఆకర్షణీయమైన ఇక్కత్ డిజైన్ వచ్చేలా అత్యంత నైపుణ్యంతో తయారు చేశారు. ఈ చీరను మడతపెడితే సులభంగా ఒక చిన్న అగ్గిపెట్టెలో ఇమిడిపోతుందని నల్ల విజయ్ కుమార్ వెల్లడించారు.గతంలో తాను తయారు చేసిన ప్రతి సరికొత్త చేనేత సృష్టికి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు లభించాయని నల్ల విజయ్ కుమార్ చెప్పారు. ఎల్లప్పుడూ దుర్గమ్మ దీవెనలు తమపై ఉండాలని కోరుకుంటూ.. ఈ సరికొత్త పట్టుచీరను సమర్పించి.. అమ్మవారి కృపకు పాత్రులు కావడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.గతంలో ఆపరేషన్ సింధు పేరుతో తయారు చేసిన అద్భుతమైన శాలువాను తయారు చేసి.. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించి తాను ప్రశంశలు అందుకున్నట్లు నల్ల విజయ్ కుమార్ తెలిపారు. అదే స్ఫూర్తితో తన చేనేత కళా నైపుణ్యాన్ని చాటుతూ తాజాగా ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఈ చీరను నేసినట్లు చెప్పారు. అమ్మవారికి సమర్పించిన ఈ అద్భుతమైన చేనేత కళాఖండాన్ని ఆలయ ఈవో శీనానాయక్ పరిశీలించారు. నల్ల విజయ్ కుమార్ అసాధారణ ప్రతిభకు చేనేత కళాకారుడిపై ప్రశంసలు గుప్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్న మన సంప్రదాయ కళలను ప్రతీ ఒక్కరూ ఆదరించాలని ఈవో శీనా నాయక్ సూచించారు.