దేశంలో నీట్ సహా పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటూ తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా నెట్టింట మరో తీవ్ర ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే నీట్ పరీక్షను రద్దు చేసిన కేంద్రం.. మళ్లీ రీటెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని.. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది.యూపీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆయా అంశాల నిపుణులు మాత్రమే రూపొందిస్తారని.. పేపర్ లీక్‌కు సంబంధించిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పీఐబీ తేల్చి చెప్పింది. అధికారిక సమాచారాన్ని మాత్రమే వెరిఫై చేసి నమ్మాలని.. ఎలాంటి నిర్ధారణ లేని వార్తలను సోషల్ మీడియాలో పంచుకోవద్దని ప్రజలకు హితవు పలికింది.అయితే.. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) తీవ్రంగా స్పందించింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకలు జరిగి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేసింది. పరీక్షలో అడిగిన 100 ప్రశ్నల్లో 82 ప్రశ్నలు.. ఒక కోచింగ్ సంస్థ అందించిన అధ్యయన మెటీరియల్‌తో సరిపోలినట్లు ఎన్ఎస్‌యూఐ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ ప్రిలిమ్స్ పరీక్షలో వచ్చిన 82 ప్రశ్నలు అనంతమ్ ఐఏఎస్ కోచింగ్ సంస్థ మెటీరియల్‌తో దాదాపు సరిపోలాయని ఎన్ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి జాఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. పరీక్ష తర్వాత ఆ నోట్స్‌లో మార్పులు చేశారని.. వాటికి సంబంధించిన తేదీలను కూడా సవరించినట్లు ఆరోపించారు. ఈ పరిణామాలు కోచింగ్ సెంటర్లు, యూపీఎస్సీ మధ్య కుమ్మక్కు జరిగి ఉండొచ్చనే అనుమానాలకు తావిస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలోనే ఈ పేపర్ లీకేజీ ఆరోపణలపై యూపీఎస్సీ వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని ఎన్ఎస్‌యూఐ డిమాండ్ చేసింది. ఈ విషయంపై యూపీఎస్సీకి లేఖ రాసి పూర్తి వివరణ కోరనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు దీనిపై పారదర్శక విచారణ జరిపి స్పష్టత ఇవ్వాలని కోరింది.అయితే.. ఈ ఆరోపణలపై అనంతమ్ ఐఏఎస్ కోచింగ్ సంస్థ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. తమకు ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం ముందుగా అందలేదని.. అందులో వచ్చే ప్రశ్నలపై ఎలాంటి ముందస్తు సమాచారం లేదని స్పష్టం చేసింది. తమపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని.. ఇవి ఒక క్రిమినల్ చర్యకు పాల్పడినట్లుగా చిత్రీకరిస్తున్నాయని పేర్కొంది.