దద్దరిల్లనున్న హైదరాబాద్.. లష్కర్ బోనాల తేదీలు వచ్చేశాయ్.. ఆగస్టు 3న రంగం

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండగకు అంతా సిద్ధం అయింది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన ఈ ఆషాఢ మాస బోనాల జాతరకు సంబంధించిన తేదీలను ఉత్సవ కమిటీ ప్రతినిధులు తాజాగా వెల్లడించారు. ఈ ఏడాది ఆషాఢమాస బోనాలు.. జూలై 19వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ ఉత్సవాలు అధికారికంగా మొదలు కానున్నాయి. దాదాపు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరం మొత్తం జరగనున్న ఈ .. ఆగస్ట్ 10వ తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతాయని తెలిపారు.ఆషాఢ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని జూలై 19వ తేదీన చారిత్రక గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తొలి బోనం సమర్పించనున్నారు. ఇక అదే రోజున హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన ఆలయాల్లో ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అప్పటి నుంచి ప్రతీ ఆదివారం, గురువారాల్లో అమ్మవారికి నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, బోనాలు సమర్పించనున్నారు.ఈ బోనాల ఉత్సవాల్లో అతి కీలక ఘట్టాలు ఆగస్ట్ తొలి వారంలో జరగనున్నాయి. ఆగస్ట్ 2వ తేదీ ఆదివారం రోజున లష్కర్ (సికింద్రాబాద్) ఉజ్జయిని మహంకాళి అమ్మవారితోపాటు ప్రధాన ఆలయాల్లో అమ్మవారికి భక్తులు భారీ ఎత్తున బోనాలను సమర్పించనున్నారు. ఆగస్ట్ 3వ తేదీ సోమవారం రోజున సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో పవిత్ర రంగం (భవిష్యవాణి) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత అంబారీపై అమ్మవారిని సాగనంపే ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టనున్నారు. గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభం కానున్న ఈ బోనాల జాతర.. ఆ తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు.. పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలతో ముగియనుంది. ఆగస్ట్ 10వ తేదీన ఉమ్మడి దేవాలయాల ఘటాల సామూహిక ఊరేగింపు.. గజరాజుపై అమ్మవారి శోభాయాత్రతో ఈ సంవత్సరం ఆషాఢ బోనాల జాతర ముగియనుంది. ఇక రాష్ట్ర పండగ అయిన ఈ బోనాల పండుగను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్, విద్యుత్ సహా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు, భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.