Advance Tax: ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.10 వేలు దాటుతుంటే వారందరూ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు విడతల్లో చెల్లించేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం అవకాశం కల్పిస్తోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొదట విడత అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు గడువు జూన్ 15గా ఉంటుంది. అయితే, జూన్ 15వ తేదీ గడువు ముగిసిపోయింది.ఇప్పుడు సైతం మీరు మీ తొలి విడత ట్యాక్స్ చెల్లించవచ్చు. కాకపోతే మీరు 3 నెలలకు సంబంధించిన వడ్డీని పెనాల్టీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో గడువు ముగిసిన తర్వాత ట్యాక్స్ ఎలా కట్టాలి, రూల్స్ ఏంటి, పెనాల్టీ లెక్కలు ఎలా అనే వివరాలు తెలుసుకుందాం.జూన్ 15వ తేదీ డెడ్‌లైన్ ముగిసిన తర్వాత కూడా అడ్వాన్స్ ట్యాక్స్ తొలి విడత కట్టవచ్చు. ఆన్‌లైన్ ద్వారానే ఇంటి నుంచే చెల్లింపులు చేయవచ్చు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో నికర పన్ను బాధ్యత (TDS మినహాయింపు తర్వాత) రూ.10 వేలు అంత కంటే ఎక్కువ ఉంటే మీరు కచ్చితంగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. జూన్ 15 నాటికి మొత్తం పన్నులో కనీసం 15 శాతం ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించాలి. ఒక వేళ అది మిస్ అయితే ఆ మొత్తాన్ని మీరు ఇప్పుడు సైతం కట్టవచ్చు. దీనివల్ల వడ్డీల భారం మరింత పెరగకుండా చూసుకోవచ్చు. పెనాల్టీ లెక్కలు ఇవిఅడ్వాన్స్ ట్యాక్స్ గడువు దాటితే ఆదాయపు పన్ను శాఖ వడ్డీ రూపంలో పెనాల్టీ వేస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లోని సెక్షన్ 424, 425 (పాత చట్టంలోని సెక్షన్ 234బీ, 234సీ)కింద వడ్డీని కట్టాల్సి వస్తుంది. గడువు దాటిన తర్వాత చెల్లిస్తే పన్ను బకాయిలపై నెలకు 1 శాతం చొప్పున సాధారణ వడ్డీ లెక్కిస్తారు. జూన్ 15వ తేదీ మిస్ అయితే ఆ విడతకు గానూ 3 నెలల కాలానికి (అంటే సెప్టెంబర్ 15 రెండో విడత గడువు వరకు) ఈ 1 శాతం చొప్పున మొత్తం మూడు నెలలకు లెక్కిస్తారు. ఉదాహరణకు మీ వార్షిక పన్ను రూ.1 లక్ష అనుకుందాం. జూన్ 15వ తేదీలోపు మీరు 15 శాతం అంటే రూ.15 వేలు కట్టాలి. కానీ మీరు రూపాయి కూడా కట్టలేదు. ఇప్పుడు ఆ రూ.15 వేలపై నెలకు 1 శాతం చొప్పున 3 నెలలకు కలిపి రూ.450 వడ్డీ పెనాల్టీ పడుతుంది.వీరికి మాత్రమే మినహాయింపు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండి, వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఎలాంటి ఆదాయం లేని భారతీయ పౌరులు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఒక వేళ జూన్ 15 తర్వాత లాటరీ వచ్చినా, క్యాపిటల్ గెయిన్స్ ఉన్నా లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించినా వాటిపై అంతకు ముందు విడతలకు పెనాల్టీ పడదు. ఆ తర్వాత వచ్చే విడతల్లో ఆ పన్నును సర్దుబాటు చయవచ్చు. ఆలస్యం చేసే కొద్దీ వడ్డీ భారం పెరుగుతుంది. అందుకే సాధ్యమైనంత త్వరగా ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ లోకి వెళ్లి ఇ-పే ట్యాక్స్ ఆప్షన్ ద్వారా మీ అడ్వాన్స్ ట్యాక్స్ బకాయిలను ఇప్పుడే పూర్తి చేయడం మంచిది.