శివసేనలో కలకలం.. ఎంపీల ఫోన్లు స్విచ్ ఆఫ్, ఢిల్లీకి మకాం మార్చిన నేతలు!

Wait 5 sec.

మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ ఎలా మారిపోతాయో ఎవ్వరికీ అంతుచిక్కవు. తాజాగా మహా రాజకీయాల్లో మరోసారి భారీ రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో తిరుగుబాటు చర్చలు జోరందుకుంటున్నాయి. పార్టీకి చెందిన కొందరు లోక్‌సభ సభ్యులు ఫోన్‌కు అందుబాటులో లేకపోవడం, మొబైల్స్ స్విచ్ ఆఫ్‌లో ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఉద్దవ్ ఠాక్రే‌తో పాటు కొందరు సీనియర్ నేతలు ఎంపీలతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు ఫోన్‌కు అందుబాటులో లేరని తెలుస్తోంది. పార్టీ వరగ్ాలు వారిని సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఢిల్లీలో పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్వహించనుండగా, ఇప్పటికే కొందరు ఎంపీలు దేశ రాజధానికి చేరుకున్నారు. ఫోన్లకు అందుబాటులో లేని కొంతమంది ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరే అవకాశాలపై చర్చ సాగుతోంది. షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే ఢిల్లీ నివాసంలో కీలక సమావేశం జరగనుందని నేషనల్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. ఈ సమావేశానికి ఏక్‌నాథ్ షిండే కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఉద్దవ్ శివసనేకు చెందిన ఆరుగురు ఎంపీలతో షిండే వర్గం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, నాగేశ్ పాటిల్ అష్టికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వక్చౌరే, సంజయ్ జాధవ్‌తో పాటు రాజాభావు వాజే కూడా పార్టీ మారే జాబితాలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉద్దవ్ శివసేనకు చెందిన ఈ ఎంపీలు తొలుత లోక్‌‌సభలో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసి అనంతరం దాన్ని ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం చేసే ప్రక్రియను చేపట్టాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా ఎంపీలు త్వరలోనే కలవనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్దవ్ శివసేన పార్టీలో తిరుగుబాటు వార్తలను ఖండిస్తున్నారు. పార్టీలో ఎలాంటి చీలిక లేదని నేతలు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు రౌత్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి రూ. 15 కోట్ల చొప్పున అడ్వాన్స్ ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.