తెలంగాణ విద్యా రంగంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ రూపురేఖలను మార్చి, పేద, మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూపుదిద్దుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ నేడు ప్రారంభం కానుంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా తొలి విడతలో పైలట్ ప్రాజెక్ట్‌గా నాలుగు పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది.రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను మొదటి విడతలో అభివృద్ధి చేశారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో ఇదే కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 100 పాఠశాలలకు విస్తరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆరుట్ల టీపీఎస్‌లో రికార్డు స్థాయిలో 1814 మంది విద్యార్థులు చదువుతుండగా.. ప్రైవేట్ స్కూళ్ల నుంచి తమ పిల్లలను ఇక్కడికి మార్చేందుకు తల్లిదండ్రులు భారీగా తరలివస్తుండటంతో అప్పుడే నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి రావడం ఈ ప్రాజెక్ట్ విజయానికి నిదర్శనంగా నిలిచింది.ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రత్యేకతలివే..కార్పొరేట్ విద్యా సంస్థలకు పూర్తి భిన్నంగా.. ఒకే ప్రాంగణంలో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులోకి వచ్చింది.విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వం కోసం ప్రతిరోజూ ఉదయం పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనంతో పాటు సాయంత్రం వేళల్లో హెల్తీ స్నాక్స్ కూడా ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుండి విద్యార్థులు సురక్షితంగా, సకాలంలో పాఠశాలకు చేరుకోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఐదు స్కూల్ బస్సులను రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసింది.అంతర్జాతీయ పాఠశాలలను తలదన్నేలా ఇక్కడ వినూత్నమైన డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సుసంపన్నమైన లైబ్రరీ, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, విశాలమైన గాలి-వెలుతురు వచ్చే క్లాస్ రూమ్‌లను నిర్మించారు.చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ఆటల కోసం ప్రత్యేక కోర్టులను, అంతర్గత జిమ్ వసతిని ఏర్పాటు చేశారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక క్రీడా శిక్షకులను నియమించారు.ఈ పాఠశాలల నిరంతర నిర్వహణ బాధ్యతను జిల్లాల్లో అదనపు కలెక్టర్లకు అప్పగించారు. ప్రతి స్కూల్ వద్ద వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ విభాగాల నుంచి ఒక్కో అధికారి నిరంతరం అందుబాటులో ఉంటూ విద్యార్థుల రక్షణను, అవసరాలను పర్యవేక్షిస్తారు.ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి ఆరుట్లలో ప్రారంభమవుతున్న ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక సజీవ సాక్ష్యంగా నిలవడమే కాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్ర విద్యా రంగంలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోనుంది.