ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంది. యూజీసీ నిధుల నిధుల దుర్వినియోగం చేసిన వ్యవహారంలో విద్యాశాఖ భారీగా జరిమానా విధించింది. ఆయన పెన్షన్ గ్యాట్యుటీని కూడా నిలిపివేసింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌గా డి వెంకటేశ్వరరావు పనిచేశారు. ఆయన 2009 డిసెంబరు నుంచి 2010 నవంబరు వరకు ప్రిన్సిపల్‌గా విధుల్లో ఉన్నారు. వెంకటేశ్వరరావు ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో రూ.26.77 లక్షల మేర యూజీసీ నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నిధుల అంశంపై వెంకటేశ్వరరావు వివరణ కూడా ఇచ్చారు.. విద్యాశాఖ ఆయన వివరణ సంతృప్తికరంగా లేదని విచారణాధికారిని కూడా నియమించింది.వెంకటేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిజమేనని తేల్చారు. ఆయన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జరిమానా విధించాలని ప్రభుత్వానికి సిఫార్సు అందింది. వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి తొలగించి.. రూ.16.80 లక్షల్ని రికవరీ చేయాలని 2017లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయలేదు. 2017 జులై నెలలో ఆయన రిటైర్ కావడంతో ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది. వెంకటేశ్వరరావు దుర్వినియోగం చేసిన డబ్బులు రూ.26.77 లక్షల్ని రికవరీ చేసి యూజీసీకి చెల్లించారు. అలాగే ఆ డబ్బులు 2024 మార్చి నాటికి 4.7శాతం రేటుతో వడ్డీ కింద లెక్కించి రూ.10.19 లక్షలు వసూలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. యూజీసీ నిధుల్ని దుర్వినియోగం చేసినందుకు వడ్డీ ఎందుకు వసూలు చేయకూడదో చెప్పాలంటూ వెంకటేశ్వరరావుకు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆయన వివరణ ఇవ్వగా ప్రభుత్వం సంతృప్తి చెందలేదు.. ఆయన దగ్గర నుంచి రూ.10.19 లక్షలు వసూలు చేయడంతో పాటుగా శాశ్వతంగా పెన్షన్‌, గ్రాట్యుటీ నిలిపివేయాలని ఆదేశించింది. తాజాగా ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. చాలా అరుదగా ప్రభుత్వ ఉద్యోగులపై ఇంత భారీగా జరిమానా విధిస్తుంటారని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసేవారికి ఇదొక హెచ్చరికనే చర్చ జరుగుతోంది.