కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపు.. రూ.258 కోట్ల నిధులు మంజూరు, నేడే పనులు ప్రారంభం

Wait 5 sec.

తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయశాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశేఖర భారతీతీర్థ స్వామి అనుమతి, శాస్త్రోక్త సూచనలతో ఈ ఆలయ పునర్నిర్మాణాలకు తుది రూపకల్పన చేశామని దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నేడు ఆలయ ప్రాంగణంలో నిర్మాణాల తొలగింపు పూజలను అర్చక బృందం అత్యంత శాస్త్రోక్తంగా ప్రారంభించింది.ఆలయ పునర్నిర్మాణాలపై మంగళవారం (జూన్ 16) ఈవో కార్యాలయంలో ఒక ఉన్నతస్థాయి ప్రత్యేక సమావేశం జరిగింది. ధార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి దేవాదాయశాఖ కమిషనర్, ఆలయ అర్చకులు, స్థానిక ప్రముఖులు, పాలకవర్గ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కాళేశ్వర క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలోనే అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని కొనియాడారు. క్షేత్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం రూ. 198 కోట్లు భారీ నిధులను మంజూరు చేయగా.. పురాణ ప్రాశస్త్యం కలిగిన పూర్వపు నాటి అష్టతీర్థాల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం అదనంగా మరో రూ. 60 కోట్లను కేటాయించిందని మొత్తం రూ. 258 కోట్లతో ఈ పనులు జరగనున్నాయని వివరించారు.కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం.. కాళేశ్వర క్షేత్రంలో ప్రస్తుతమున్న సిమెంట్ కట్టడాల స్థానంలో కాకతీయ, ద్రవిడ శిల్పకళా ఉట్టిపడేలా సంప్రదాయ రాతి కట్టడాల నిర్మాణాలను చేపట్టనున్నారు. దీనివల్ల ఆలయ ఆవరణం అత్యంత విశాలంగా మారడమే కాకుండా.. రాబోయే వందల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా నిలిచిపోతుంది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఒకే సమయంలో ఆలయ ఆవరణలో దాదాపు 25 వేల మంది భక్తులు వేచి ఉండేలా విశాలమైన మండపాలు, క్యూలైన్లు, వసతి సౌకర్యాలను నిర్మిస్తున్నారు.సమయపాలన విషయంలోనూ దేవాదాయశాఖ అత్యంత కచ్చితంగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది జూన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాల వేళకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరానికి తరలివచ్చే అవకాశం ఉంది. అందువల్ల, పుష్కరాలు ప్రారంభం కావడానికి ఒక నెల ముందుగానే.. అంటే మే 2027 నాటికే ఈ పునర్నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడువు విధించారని, ఆ మేరకు పనులను శరవేగంగా పూర్తి చేస్తామని కమిషనర్ హనుమంతరావు చెప్పారు.