తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు స్వామివారికి, టీటీడీకి కానుకలు, విరాళాలు సమర్పిస్తుంటారు. భక్తులు బంగారం, వెండి, డబ్బులు, విలువైన వస్తువులు, వాహనాలు అందజేస్తారు. మరికొందరు భక్తులు టీటీడీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల కోసం నిర్వహిస్తున్న ట్రస్టులకు భారీగా విరాళాలు అందుతున్నాయి. కొంతకాలంగా స్వామివారి పేరుతో నడుస్తున్న ఈ టీటీడీ ట్రస్టులకు విరాళాలు పెరిగాయి. తాజాగా టీటీడీకి మరో భక్తుడు భారీ విరాళం అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు. కోల్‌కతాకు క్రిప్టాన్ ఫ్యామిలీ ట్రస్టుకు చెందిన పదమ్ కుమార్ అగర్వాల అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,00,00,536 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు విరాళం డీడీని అందజేశారు. ఇటు తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన శ్రీ విష్ణు వారి ఫౌండేషన్ ప్రతినిధులు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి రెండు గొడుగులను విరాళంగా అందజేశారు. ఈ మేరకు రెండు గొడుగులను టెంపుల్ సూపరింటెండెంట్ సురేష్‌కు అందజేశారు. అంతకుముందు ఫౌండేషన్ ప్రతినిధులు పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తులు రద్దీ మరింత పెరిగింది.. వేసవి సెలవులు ముగియడంతో పాటుగా వీకెండ్ కావడంతో గత మూడు రోజుల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు. టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. తిరుమలలోని దర్శన క్యూలైన్లలో 29 పాయింట్లలో భక్తులకు అన్న ప్రసాద పంపిణీ చేస్తున్నారు. శ్రీవారి సేవకులు భక్తులకు అన్న ప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ అందిస్తున్నారు. 37 పాయింట్లలో తాగునీటి కుళాయిలను ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాటు చేశారు. టీటీడీ క్యూలైన్లలో 49 పాయింట్లలో త్రాగునీటి డ్రమ్ములు ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ విభాగం భక్తుల రద్దీని అంచనా వేస్తూ భక్తులు సౌకర్యవంతమైన దర్శనం కల్పించే పనిలో ఉన్నారు. గత మూడు రోజుల్లో మొత్తం 2,42,894 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం 75,428 మంది, శుక్రవారం 74,636 మంది భక్తులు, శనివారం 92,830 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు. గత మూడు రోజుల్లో 1,34,637 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. క్షురకులు భక్తులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 52 మంది భక్తులు రక్తదానం చేశారు.