అమెరికా - ఇరాన్ మధ్య వంద రోజులుగా సాగుతున్న యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. ఎన్నోసార్లు వాయిదా పడిన శాంతి ఒప్పందం మొత్తానికి కుదిరింది. ఫిబ్రవరి 28 నుంచి సాగుతున్న యుద్ధం ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. డీల్ ప్రకటన చేసే సమయంలో 'ప్రపంచ నౌకలారా.. మీ ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. చమురును పారించండి' అంటూ పిలుపునిచ్చాడు. అయితే, హార్మూజ్ జలసంధిలో అప్పటిలాగా నౌకల ప్రయాణం ఇప్పటికిప్పుడు సాధ్యమవుతుందా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అమెరికా - ఇరాన్ మధ్య తాజాగా కుదిరిన శాంతి ఒప్పందంలో అత్యంత కీలకమైనది హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడమే. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం ఈ హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం, ఎక్కువ భాగం సహజ వాయువు ఎగుమతులు ఈ జలమార్గం ద్వారానే జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అనుమతి ఇచ్చారు. "ఇస్లామిక్ రిపబ్లిక్‌‌‌‌ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం పూర్తయింది. హార్మూజ్ జలసంధిని తెరవడానికి, అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించడానికి నేను పూర్తిగా అనుమతి ఇస్తున్నాను. ప్రపంచ నౌకలారా.. మీ ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. చమురును పారించండి" అంటూ ట్రంప్ పిలుపునిచ్చారు. హార్మూజ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?ఇక్కడ ట్రంప్ ప్రకటన చేసిన వెంటనే హార్మూజ్ జలసంధి రవాణా వెంటనే ప్రారంభం అవుతుందా? అంటే కాదనే చెప్పాలి. అమెరికా ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.. ఇరాన్ ఇంకా కొన్ని పరిమితులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులు చెప్పిన దాని ప్రకారం.. ఇరాన్ జలసంధి పరిసరాల్లో సముద్ర మైన్‌లు ఏర్పాటు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఈ హార్మూజ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే ముందుగా ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్‌లు తొలగించాలి. ఆ తర్వాత దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు తిరిగి మరమ్మతులు చేయాలి.. చివరగా నౌకల భద్రతలపై హామీలు రావాలి. ఆ తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో వాణిజ్య నౌకలు పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. శాంతి ఒప్పందంలో ఏముంది?అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందంలో ప్రధానంగా యుద్ధం పూర్తిగా ముగిసిపోలేదని.. యుద్ధ విరమణను ప్రస్తుతానికి 60 రోజులు పొడిగించినట్లు మాత్రమే తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు, యురేనియం శుద్ధి చేయడంపై నిబంధనలు, అలాగే లెబనాన్‌లో ఇజ్రాయెల్ - హెజ్‌బొల్లా మధ్య దాడులు నిలపివేయాలి అనేది కూడా ఈ శాంతి ఒప్పందంలో భాగంగా ఉన్నట్లు సమాచారం. ఈ డీల్‌కి పాకిస్థాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహించడం విశేషం.