: చాలా మందికి ఇన్వెస్ట్ చేయాలని ఉన్నప్పటికీ ఎప్పుడు ఎలా ఎంత పెట్టుబడి పెట్టాలో సరైన అవగాహన ఉండదు. చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో రిస్క్ ఉన్నా మంచి రిటర్న్స్ అందిస్తుంటాయి. అయితే ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి. లంప్ సమ్, సిప్. అవును లంప్ సమ్ అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం. అదే సిప్ అంటే క్రమానుగతంగా చిన్న మొత్తాలో ఇన్వెస్ట్ చేస్తూ పోవడం. ఇక్కడ లంప్ సమ్ అనేది మీ దగ్గర ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే చేయొచ్చు. అదే సిప్ అంటే ఉద్యోగం చేస్తూ నెలనెలా జీతం పొందేవారికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ నెలనెలా చిన్న మొత్తాల్లో తోచినంత డబ్బులు జమ చేస్తూ పోవచ్చు. మరి ఇక్కడ దేంట్లో ఎక్కువ రాబడి వస్తుందనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. అంటే ఒకేసారి పెద్ద మొత్తం జమ చేయాలా.. లేదా అదే మొత్తాన్ని సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ పోవాలా? అనే ప్రశ్న సాధారణంగానే వస్తుంది. ఇక్కడ దీనిని మనం ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. మీరు ఏదైనా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి అకౌంట్ మెచ్యూర్ అయి మీ చేతికి రూ. 10 లక్షలు వచ్చాయనుకుందాం. దీనిని మరో ఎఫ్‌డీలో కాకుండా మ్యూచువల్ ఫండ్ స్కీంలో ఇన్వెస్ట్ చేయడం కాస్త బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. లేదా మీరు పొదుపు చేస్తుంటే గనుక మీ జీతంలో నుంచి నెలనెలా రూ. 10 వేల మొత్తాన్ని సిప్ చేస్తూ పోవచ్చు. ఇక్కడ చాలా వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సగటున వార్షికంగా 12 శాతం రిటర్న్స్ ఇస్తుంటాయి. ఇదే లెక్కన చూస్తే రూ. 10 లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం లేదా నెలకు రూ .10 వేల చొప్పున మొత్తంగా రూ. 10 లక్షలను 100 నెలలకు (8 సంవత్సరాల 4 నెలలు) ఇన్వెస్ట్ చేస్తే రాబడి ఎంత వస్తుందో చూద్దాం. నెలకు చేస్తే 100 నెలల్లో పెట్టుబడి మొత్తం రూ. 10 లక్షలు కాగా ఇక్కడ రూ. 7.21 లక్షల వరకు వడ్డీ రాబడి వస్తుంది. మొత్తం చేతికి రూ. 17.21 లక్షలు వస్తాయి.అదే రూ. 10 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే అదే 12 శాతం వార్షిక రాబడి లెక్కన 100 నెలల్లో రూ. 15.71 లక్షల వడ్డీ వస్తుంది. చేతికి మొత్తం రూ. 25.71 లక్షలు వస్తాయి. దీనిని బట్టి చూస్తే లంప్ సమ్‌పై ఇక్కడ అధిక రాబడి వచ్చింది. కాబట్టి.. వారసత్వ సంపద వచ్చినా, పెద్ద మొత్తంలో బోనస్ అందుకున్నా, FD అకౌంట్ మెచ్యూర్ అయినా లంప్ సమ్‌ను ఇలా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు చూడొచ్చంటున్నారు. సిప్ మాత్రం కాలం గడుస్తున్న కొద్దీ సంపదను విశేషంగా పెంచుతుందని సూచిస్తున్నారు.