మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి జరిగింది. మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ లీగ్ స్టేజ్ మ్యాచ్‌కు అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన మ్యాచ్‌గా ఇది నిలిచింది. గతంలో కూడా భారత్, పాక్ మ్యాచే ఈ రికార్డు నెలకొల్పింది. తాజా మ్యాచ్ దాన్ని అధిగమించింది.బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన గ్రూప్-1 మ్యాచ్ చూసేందుకు ఏకంగా 18,814 మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు. మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో ఓ లీగ్‌ మ్యాచ్‌కు ఈ స్థాయిలో అభిమానులు రావడం ఇదే తొలిసారి. గతంలో అక్టోబర్ 6, 2024న దుబాయ్‌లో జరిగిన భారత్, పాకిస్థాన్ మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు 15,935 మంది హాజరయ్యారు. తాజాగా ఈ రికార్డు బ్రేక్ అయింది.ఈ స్థాయిలో అభిమానులు స్టేడియానికి రావడం అనేది మహిళల క్రికెట్ పురోగతిని, పెరుగుతున్న ఆదరణను సూచిస్తోంది. అంతేకాకుండా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్‌ను మరోసారి రుజువు చేసింది. కాగా ఈ మ్యాచులో భారత మహిళల జట్టు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో ఖాతా తెరిచింది.ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 17 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది. గ్రూప్-ఏ పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా +3.250 నెట్ రన్ రేట్‌, 2 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్.. +3.200 నెట్ రన్ రేట్, 2 పాయింట్లతో రెండో ప్లేసులో ఉంది. భారత్ తన తర్వాతి మ్యాచులో జూన్ 17న నెదర్లాండ్స్‌తో తలపడనుంది.