తెలంగాణకు హైదరాబాద్ చేసింది. ఈ నెల 18 నుంచి వరుసగా మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ కీలక సూచనలు చేసింది. నైరుతి రుతుపవనాల కదలికల్లో వచ్చిన మార్పుల కారణంగా ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి మూడ్రోజుల పాటు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.మరోవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు నెమ్మదించడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 8వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించిన ఈ రుతుపవనాలు.. కొద్దికొద్దిగా ముందుకు కదులుతూ 11వ తేదీ నాటికి హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల వరకు విస్తరించాయి. అయితే ఆ తర్వాత వాటి కదలిక పూర్తిగా మందగించింది. ఇవి రాష్ట్రమంతటా విస్తరించడానికి మరో నాలుగు రోజుల సమయం పట్టవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలను ఈ పవనాలు ఇంకా తాకకపోవటంతో ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఎండల తీవ్రత విపరీతంగా కొనసాగుతోంది.ప్రస్తుతం ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భానుడి భగభగలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో గరిష్టంగా 42.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, ములుగు, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లోని అత్యధిక మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదయ్యాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న మూడు రోజుల్లో ఈ జిల్లాల్లో వాతావరణం చల్లబడి, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది.ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించింది. జీహెచ్ఎంసీతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డ్రైనేజీలు, నాలాల ఉధృతిపై నిరంతరం నిఘా ఉంచాలని, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖను కోరారు. నగర ప్రజలు కూడా వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణశాఖ సూచించింది.వర్షాల సమయంలో అధికారుల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ ఆగ్రహంరాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ముందస్తు చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల వర్షాల సమయంలో మున్సిపల్, పోలీసు సిబ్బంది మధ్య కనీస సమన్వయం కొరవడటంపై సీఎం తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 1న నిర్వహించిన సమీక్షలోనే వర్షాలపై ముందస్తు సూచనలు, ఆదేశాలు ఇచ్చినప్పటికీ జూన్ 9న నగరంలో వాన కురిసిన సమయంలో అధికారులు క్షేత్రస్థాయిలో సరిగా స్పందించలేదని మండిపడ్డారు. వర్షం వస్తే ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ రోడ్లపైనే ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ను, నీటి నిల్వలను నియంత్రించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, అవసరమైతే తానే స్వయంగా రోడ్లపైకి వచ్చి రంగంలోకి దిగుతానని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.