శ్రీశైలం మల్లన్నకు ప్రముఖ వ్యాపారవేత్త ఖరీదైన కానుకలు.. భారీగా బంగారం, వెండితో తయారీ

Wait 5 sec.

శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భారీగా కానుకలు అందాయి. కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన శ్రీలలితా ఎంటర్‌ప్రైజెస్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు రూ.కోటి విలువైన కానుకలు అందజేశారు. 73.500 గ్రాముల బంగారం, 42.516 గ్రాముల వెండి ఆభరణాలను సమర్పించారు. ఈ బంగారం, వెండి కానుకల విలువ రూ.కోటి ఉంటుందని దాత తెలిపారు. దాతలు ఆభరణాలను ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యుడు ఆలా అనిల్‌కుమార్‌లకు అందజేశారు. దాత వెంట ఆయన కుటుంబసభ్యులు రోహన్, రాకేష్, సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ డైరెక్టర్‌ ఆదిత్యకృష్ణలు కూడా ఉన్నారు.కానుకలు అందించిన తర్వత దాతలకు అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనాలు అందించారు.. ఈవో, ధర్మకర్త స్వామివార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. స్వామివారికి అందజేసిన వాటిలో బంగారు నామాలు, బంగారు రుద్రాక్షమాల, మంగళసూత్రాలు, వెండి చంద్రవంక జటాజూటం, వెండి పూజా వస్తువులు సమర్పించారు. మల్లన్నకు కానుకలను సమర్పించిన దాతల కుటుంబానికి శ్రీశైలం ఆలయ నియమ నిబంధనల ప్రకారం అధికారికంగా రశీదును అందజేశారు.శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం సాయంత్రం నుంచి రద్దీ కనిపించింది. శ్రీశైలంలో వసతి గదులను ఆన్‌లైన్‌ ద్వారా ముందుగా నమోదు చేసుకున్న వారు తప్ప మిగిలిన వారు గదుల విషయంలో ఇబ్బందిపడ్డారు. రెండు రోజులుగా తెల్లవారుజాము నుంచి ఆలయంలో దర్శనాలు ప్రారంభించారు. భక్తుల రద్దీ పెరగడంతో వీఐపీ బ్రేక్‌ స్పర్శ దర్శనాలు కేవలం రెండు విడతలకు పరిమితం చేశారు. భక్తుల రద్దీని గమనించి ఆలయ ఈవో అవసరమైన ఏర్పాట్లు చేశారు.వేసవి సెలవులు కావడంతో శ్రీశైలంలో కూడా భక్తుల రద్దీ కనిపించింది. ముఖ్యంగా వీకెండ్‌లో భక్తుల సంఖ్య పెరిగింది. ఆలయ ఈవో, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటం, వీకెండ్ రెండు రోజుల పాటూ సెలవులు కావడంతో శ్రీశైలానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం నుంచి శ్రీశైలంలో భక్తుల రద్దీ కాస్త తగ్గుతుందని భావిస్తున్నారు.