వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వ్యవసాయ రంగానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించింది. వానాకాలం సీజన్‌ సన్నద్ధతపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఇక్కడ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్‌నినో వల్ల తలెత్తబోయే పరిస్థితులు, వర్షపాతంలో అనిశ్చితి, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు తక్కువ నీటితో సాగయ్యే కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం వంటి ప్రత్యామ్నాయ పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వానాకాలం సీజన్‌లో రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా యూరియా పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతువేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పంపిణీ బాధ్యతలను స్థానిక వ్యవసాయాధికారులకు అప్పగించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కోసం వ్యవసాయ శాఖతో పాటు రెవెన్యూ సిబ్బందినీ భాగస్వాములను చేయాలని చెప్పారు. సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ ప్రకటించిన ఎనిమిది రకాల నాణ్యమైన విత్తనాలపై క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు.రైతుల ఆదాయాన్ని పెంచడం, వాతావరణ మార్పుల వల్ల కలిగే పంట నష్టాలను తగ్గించటమే లక్ష్యంగా ప్రభుత్వం సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా కేవలం వరి పంటపైనే అధికంగా ఆధారపడకుండా, పంటల వైవిధ్యీకరణ వైపు రైతులను మళ్లించేందుకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వాణిజ్య, అపరాల పంటల వైపు మొగ్గు చూపేలా రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొరత ఎక్కడా తలెత్తకుండా ముందస్తుగా బఫర్ స్టాక్ నిల్వలను సిద్ధం ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.రైతుల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఎరువుల బుకింగ్‌ యాప్‌లో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. ఇకపై రైతులకు మరింత సులభంగా ఉండేలా మీసేవ కేంద్రాల ద్వారా కూడా ఎరువుల బుకింగ్ చేసుకునే సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు ఉంటాయని, టాస్క్‌ఫోర్స్ బృందాలతో నిరంతర తనిఖీలు నిర్వహిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.అన్నదాతలు తమ ప్రాంతాల్లోని స్థానిక వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ, వ్యవసాయ శాఖ జారీ చేసే సూచనలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి తుమ్మల కోరారు. ఎల్‌నినో ముప్పును దృష్టిలో పెట్టుకొని అన్నదాతలకు కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని, వ్యవసాయ సలహాలను అందించేందుకు ప్రత్యేక మొబైల్ ఆధారిత సేవలను ప్రారంభించామన్నారు. దీని ద్వారా మండలాల వారీగా రోజువారీ వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం, తేమ శాతం తదితర వివరాలను నేరుగా రైతుల వాట్సప్‌ నంబర్లకు సందేశాల రూపంలో చేరవేస్తున్నట్లు వెల్లడించారు.