అరుదైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన తమ కుమారుడు నిరంజన్‌ను చూసేందుకు స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ ఇంటికి రావడంతో.. , అతడి తల్లిదండ్రులు అదృష్టంగా భావిస్తున్నారు. లేవలేని స్థితిలో ఉన్న తమ కుమారుడి కోరికను తీర్చేందుకు పవన్ కళ్యాణ్ రావడం.. తమకు చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. తమ కుటుంబానికి అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తమ కుమారుడు అడిగినవన్నీ చేస్తానని చెప్పారని వివరించారు. హనుమకొండలోని హనుమాన్ నగర్‌లో నివసించే పొనుగోటి రాంగోపాల్, మానసల కుమారుడైన నిరంజన్ వయసు 17 ఏళ్లు కాగా.. వయసు తగ్గట్టు అతడి ఎదుగుదల లేదు. అంతేకాకుండా ఒంటిపై ఎక్కడ ముట్టుకున్నా భరించలేని నొప్పితో నిరంజన్ బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చూడాలన్న తమ కుమారుడి కోరిక తీరడంతో.. రాంగోపాల్, మానస దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ తమ ఇంటికి రావడం, తమ కుమారుడి కోరికను తీర్చడంతో.. ఆ కొండగట్టు ఆంజనేయస్వామి తమ ఇంటికి వచ్చి.. తమ కొడుకును ఆశీర్వదించినట్లు ఉందని.. రాంగోపాల్, మానస దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక రాంగోపాల్, మానస దంపతులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అతని వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. ఇక ఏం పని చేస్తారని నిరంజన్ తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. వారికి ఒక హామీ ఇచ్చారు. గతంలో తాము కాకతీయ ఆస్పత్రి క్యాంటీన్‌లో పని చేశామని వారు చెప్పగా.. వారి కుటుంబానికి జీవనోపాధి కల్పించేందుకు సొంతంగా ఒక క్యాంటీన్ పెట్టించాలని తెలంగాణ జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఇక నిరంజన్‌ను చూసేందుకు పవన్ కళ్యాణ్ హనుమకొండకు వెళ్లడంతో.. ఆయనను చూసేందుకు జనం భారీగా ఎగబడ్డారు. నిరంజన్ ఇంటి పరిసర ప్రాంతాలు మొత్తం జనంతో నిండిపోయాయి. వారందరికీ పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.