రూ. 5 లక్షల కోట్ల విలువైన NSE ఐపీఓ వస్తోంది.. వాటా విక్రయిస్తున్న ఎస్బీఐ.. BSE షేర్లు డౌన్!

Wait 5 sec.

: భారత స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి నెలకొంది. వాయిదా పడ్డాయనుకున్న సంస్థలు ఐపీఓలుగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వీటిల్లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, జెప్టో, NSE గురించి చర్చ ప్రధానంగా నడుస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మార్కెట్ పరిస్థితులు బాగోలేక ఐపీఓ ప్రణాళికల్ని వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు ఇరాన్- అమెరికా మధ్య డీల్ కుదరగా.. మార్కెట్లలో జోష్ నెలకొంది. వరుసగా 4 సెషన్లలో భారత సూచీలు దూసుకెళ్లాయి. దీంతో మళ్లీ తమ ఐపీఓల్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎంకు ముందుగానే సెబీకి డ్రాఫ్ట్ పేపర్స్ సమర్పించనున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజీగా ఉన్నటువంటి NSE కూడా అదే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. NSE కూడా సెబీకి ముసాయిదా పత్రాల్ని ఈ వారంలోగా అంటే శుక్రవారం లోపటి వరకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ NSE లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 10.72 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. కానీ ఎల్ఐసీ.. ఈ ఐపీఓలో భాగంగా వాటాను విక్రయించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా దాని సబ్సిడరీ ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు కూడా వాటా 7.5 శాతం వరకు ఉంది. ఇక మొత్తంగా ఎన్ఎస్ఈ ఐపీఓ కోసం 6 శాతం వరకు వాటాను ఓఎఫ్ఎస్ రూపంలో విక్రయించనున్నట్లు సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఓ కోసం సంస్థ మార్కెట్ విలువను సుమారు రూ. 5 లక్షల కోట్లుగా అంచనా వేస్తుండగా రూ. 30 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలిచేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఓ కోసం అత్యధికంగా ఎస్బీఐ సుమారు 24.75 మిలియన్ల షేర్లను అంటే 2.47 కోట్ల వరకు షేర్లను విక్రయిస్తుందని తెలుస్తోంది. తర్వాత వరుసగా ఇందులో వాటా ఉన్న MS స్ట్రాటజిక్ (మారిషస్) లిమిటెడ్ 1.60 కోట్ల షేర్లు, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు 1.18 కోట్ల షేర్లు, అరండా ఇన్వెస్ట్‌మెంట్స్ 1.12 కోట్ల షేర్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.09 కోట్ల షేర్లను విక్రయిస్తుందని సమాచారం. మరోవైపు NSE IPO బజ్‌తో బుధవారం సెషన్‌లో SBI షేరు ఒక శాతానికిపైగా పెరిగి రూ. 1026.50 వద్ద స్థిరపడింది. ఎల్ఐసీ షేరు కూడా 1.70 శాతం పెరిగి రూ. 418 వద్ద సెషన్ ముగించింది. మరోవైపు NSE ఐపీఓ వస్తుండగా.. BSE షేరు దాదాపు 4 శాతం వరకు పతనంతో రూ. 4004 వద్ద స్థిరపడింది.