పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా ఢిల్లీ ఎస్ఐ

Wait 5 sec.

దేశం కాని దేశంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడం అంటే సాధారణ విషయం కాదు. అలాంటిది, ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన మాజీ అధికారి తీసుకున్న సాహసోపేత నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని, ఆస్ట్రేలియాలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆయన కథ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఢిల్లీ మాజీ పోలీస్ ఎస్ఐ‌గా రాజీనామా చేసి, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా స్థిరపడ్డారు. అక్కడ ఎంతో మంది ప్రవాసుల సొంతింటి కలను ఆయన సాకారం చేస్తున్నారు. 2023లో ఉద్యోగాన్ని వదులుకోవాలని తాను తీసుకున్న నిర్ణయం గురించి తాజాగా నిశాంత్ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. ‘‘కొన్నేళ్ల కిందట నేను తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని చాలామంది పిచ్చి పని అనుకున్నారు...భారత్‌లో నేను సురక్షితమైన ఉద్యోగాన్ని వదులుకుని అనేక అనిశ్చితుల మధ్య ఆస్ట్రేలియాకు చేరుకున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. అక్కడ జీరో నుంచి నా ప్రయాణాన్ని మొదలుపెట్టానని, ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సొంతంగా ఇల్లు కట్టుకోవడమే కాకుండా, ప్రస్తుతం చాలా మందికి వారి సొంతంటి కలను నెరవేర్చడంలో తన వంతు సహకారం అందిస్తున్నట్లు ఆయన వివరించారు.‘‘ఈ విజయం నాకు కేవలం అదృష్టం వల్లే సాధ్యం కాలేదు.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం, ఆ దేశంలో కొత్త వాతావరణానికి అనుగుణంగా మారడం, క్లిష్టమైన పరిస్థితుల్లోనూ పట్టుదల వల్లే ఇది సాధ్యమైంది’’ అని నిషాంత్ వెల్లడించారు. అయితే, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే వారికి ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. ‘‘జీవితంలో కొన్నిసార్లు మనల్ని అత్యంత భయపెట్టే నిర్ణయాలే అద్భుతమైన అవకాశాలకు మార్గంగా మారుతాయి’’ అని ఆయన పేర్కొన్నారు.సోషల్ మీడియాలో నిషాంత్ వీడియోకు విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా విదేశాలలో వివిధ అనిశ్చితులు, ఒంటరితనం వల్ల కలిగే మానసిక క్షోభ, గౌరవప్రదమైన వృత్తి నుంచి ఎంట్రీ లెవెల్ ఉద్యోగానికి మారడం, సున్నా నుంచి నెమ్మదిగా పునర్నిర్మించుకునే ప్రక్రియ వంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న చాలా మంది భారతీయులకు నిషాంత్ కథ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోకు 67 వేలకుపైగా వ్యూస్, దాదాపు 1800 వరకు లైక్స్ వచ్చాయి. ఆ పోస్ట్ నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించింది. చాలామంది ఆయన కెరీర్ మార్పు గురించి కామెంట్లలో అడిగారు. ‘‘మీరు రాజీనామా చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో ఉద్యోగం సంపాదించడానికి ఏ ఉద్యోగం లేదా కోర్సు చేశారు?’’ అని ఒకరు, ‘‘వినడానికి చాలా సంతోషంగా ఉంది. దేవుడు దయ మీపై ఉండాలి’’ అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. మరికొందరు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.