గాదె సాయికృష్ణ: కృష్ణలంక ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. విచారణకు ఆదేశం..

Wait 5 sec.

విజయవాడ గాదె సాయికృష్ణ అంశం ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో పోలీసులు సాయికృష్ణను లాకప్‌లో కొట్టి చంపారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. కృష్ణలంక ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి నారా నాయుడు డీజీపీ హరీష్ గుప్తాను ఆదేశించారు. ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి వాస్తవాలు తేల్చాలని స్పష్టం చేశారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని డీజీపీని ఆదేశించారు. మరోవైపు ఏపీలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం కాగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబుతో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం వరంగల్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గాదె సాయికృష్ణ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో డీజీపీ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజును వీఆర్‌కు పంపించినట్లు సీఎం, డిప్యూటీ సీఎంకు డీజీపీ వివరించినట్లు తెలిసింది. అయితే సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు సాయికృష్ణను పోలీసులే లాకప్ డెత్ చేసినట్లు కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై విలేకర్ల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ తల్లి ఆవేదన బాధ కలిగిస్తోందన్న అంబటి రాంబాబు.. పార్టీలకు అతీతంగా వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సాయికృష్ణ కోసం కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే.. పోలీసులు సాయికృష్ణ కోసం వెతుకుతున్నామని చెప్తున్నారని అన్నారు. సాయికృష్ణ ఘటనపై సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్‌కు చేతులు జోడించి అడుగుతున్నానని అంబటి రాంబాబు తెలిపారు. మరోవైపు సాయికృష్ణ బూడిద అయినా ఇవ్వాలంటూ అతని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.