Upcoming IPOs: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పెద్దగా పబ్లిక్ ఇష్యూలు రాలేదు. అంతర్జాతీయంగా అనిశ్చితులు తలెత్తడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. డాలర్ పెరగడంతో రూపాయి విలువ జీవనకాల కనిష్ఠాలకు పడిపోయింది. ఇవన్నీ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంటును బలహన పరిచాయి. ఇన్ని ఊగిసలాటల మధ్య అయితే, ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఇరాన్- అమెరికా మధ్య డీల్ కుదిరినట్లు వస్తున్న వార్తలతో దాడులు సైతం తగ్గాయి. చమురు ధరలు దిగివచ్చాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయ్యేందుకు డజనుకు పైగా కంపెనీలు సిద్ధమయ్యాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. రూ.60 వేల కోట్లుగత ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓల ద్వారా ఏకంగా 3.5 బిలియన్ డాలర్ల పైనే అంటే దాదాపు రూ.33,500 కోట్ల నిధులను కంపెనీలు సమీకరించాయి. గత 2 ఏళ్లలో రికార్డ్ స్థాయిలో 20 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.1.90 లక్షల కోట్లకు పైగా నిధులను సమీకరించాయి. ఈ రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది 2026లో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ చాలా తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, వచ్చే 2 నెలల్లో ప్రాథమిక మార్కెట్ కాస్త పుంజుకోనుందన్న వార్తలు ఊరట కల్పిస్తున్నాయి. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ), సంస్థాగత మదుపరులకు షేర్ల కేటాయింపు, ప్రభుత్వ వాటాల విక్రయాలకు సంబంధించిన ఇష్యూల ద్వారా డజనుకు పైగా కంపెనీలు దాదాపు రూ.60 వేల కోట్ల మేర నిధులను సమీకరించే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు స్తబ్ధుగా కొనసాగిన మార్కెట్‌కు ఈ ఐపీఓలు మళ్లీ పునరుత్తేజాన్ని తీసుకురావచ్చు. లిస్ట్‌లో ఉన్న ప్రధాన కంపెనీలు ఇవేవచ్చే కొన్ని నెలల్లో పబ్లిక్ ఇష్యుకు రానున్న కంపెనీలలో ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ కంపెనీ (SBI Mutual Fund) అత్యధికంగా రూ.13 వేల కోట్ల నిధులను సమీకరించనుందని సమాచారం. మలివిడత వాటా విక్రయం ద్వారా వారీ ఎనర్జీస్ రూ.7 వేల కోట్లు, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా రూ.7,500 కోట్ల మేర సమీకరిస్తున్నాయి. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో మలివిడత పబ్లిక్ ఆఫర్ ద్వారా 2 శాతం వాటాను విక్రయించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ ట్రాన్సాక్షన్ల ద్వారా దాదాపు రూ.10 వేల కోట్లను సమీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక హిందుస్థాన్ జింక్‌లోనూ 2 శాతం వాటా విక్రయం ద్వారా రూ.5 వేల కోట్లను సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు.. సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సైతం 2.5 బిలియన్ డాలర్లు సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు మొత్తం 164 కంపెనీలకు సెబీ నుంచి ఆమోదం లభించింది. మరో 62 కంపెనీలు ముసాయిదా పత్రాలను సమర్పించి అనుమతి కోసం చూస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత చురకైన ప్రాథమిక మార్కెట్లలో ఒకటిగా భారత మార్కెట్ ఉంది.అలాగే రాబోయే రెండు నెలల్లో 50కి పైగా నమోదిత కంపెనీల లాక్ ఇన్ పీరియడ్‌లు ముగియనున్నట్లు నువామా వెల్త్ మేనేజ్మెంట్ ప్రకారం తెలుస్తోంది. దీని వల్ల వ్యవస్థాపకులు, కంపెనీల తొలి పెట్టుబడిదారు అమ్ముకునేందుకు రూ.80 వేల కోట్లకు పైగా విలువైన షేర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిమాణం స్టాక్ మార్కెట్లలో షేర్ల సరఫరాను మరింత పెంచే అవకాశం ఉంది. అయితే, ఒకేసారి అనేక పెద్ద ఇష్యూలు ప్రారంభిస్తే కొత్త షేర్ల సరఫరాను గ్రహించే మార్కెట్ సామర్థ్యం పరీక్షకు గురికావచ్చని పెట్టుబడిదారులు హెచ్చరిస్తున్నారు.