భారత్‌కి అమెరికా డైరెక్ట్ వార్నింగ్! జైశంకర్‌-రూబియో ఫోన్ సంభాషణపై శశథరూర్ ఆగ్రహం

Wait 5 sec.

ఒమాన్ ప్రాంతంలో హార్మూజ్ జలసంధిలో భారతీయులున్న నౌకలను అమెరికా టార్గెట్ చేసిన విషయం తెలిసింది. వరుసగా మూడు నౌకలపై దాడి చేయగా.. అందులో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో‌‌ భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సంభాషణలో అమెరికా కనీసం సంఘీభావం తెలపకపోగా.. భారత్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది. అమెరికా తీరుపై విదేశాంగ సహాయ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన నోట్‌ను అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ అధికారికంగా వెల్లడించారు. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాలపై రూబియో మాట్లాడుతూ.. హార్మూజ్ జలసంధిలో శాంతి, భద్రతను కాపాడేందుకు అమెరికా దళాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. అన్ని వాణిజ్య నౌకలు వెంటనే అమెరికా బలగాల ఆదేశాలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా అమెరికా విధించిన దిగ్బంధాన్ని ఉల్లంఘించడం లేదా అక్రమంగా ఇరాన్ చమురును రవాణా చేయడాన్ని ఏమాత్రం సహించబోమంటూ రూబిన్ హెచ్చరించారు. అమెరికా అధికారిక ప్రకటనపై శశిథరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు. "అమాయక భారతీయుల ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకుండా అమెరికా ప్రకటన విడుదల చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్నేహపూర్వక దేశం, వ్యూహాత్మక భాగస్వామి ఎలా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? హార్మూజ్ జలసంధి మార్గంలో ప్రయాణించే దాదాపు ప్రతి వాణిజ్య నౌకలో భారతీయ సిబ్బంది ఉంటారు. అంటే వారందర్నీ అమెరికా తమ క్షిపణులకు లక్ష్యాలుగా చేస్తుందా? ఈ విధానం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో దృష్టికి తీసుకెళ్లారని నేను అనుకుంటున్నాను" అని పోస్ట్ చేశారు.అమెరికా విడుదల చేసిన ఈ అధికారిక ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ నావికుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. నావికుల మరణాలపై కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామిగా చెప్పుకొనే అమెరికా ఇలా వ్యవహరించడం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పకనే చెబుతోంది. అమెరికా - భారత్ మధ్య సంబంధాలు దిగజారుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ వేదికగా జరగనున్న జీ7 సదస్సులో మోదీ - ట్రంప్ భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ సాగే అవకాశం ఉంది. మరి ఈ భేటీలో భారత్‌పై అమెరికా వ్యవహరిస్తున్న తీరును ప్రధాని మోదీ ప్రస్తావిస్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.