టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక సమాజ సేవలోనూ ఆదర్శ దంపతులమని నిరూపించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఘనంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. పెళ్లి ముగిసిన వెంటనే ఒక కీలకమైన సామాజిక నిర్ణయాన్ని తీసుకున్నారు. వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన తండ్రి పుట్టిన సొంత ఊరైన నాగర్‌కర్నూల్ జిల్లాలోని తుమ్మన్‌పేట గ్రామానికి రష్మికతో కలిసి వెళ్లారు. అక్కడ తమ నూతన గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించుకున్న సందర్భంలో.. గ్రామస్థుల సమక్షంలో ఒక కీలక ప్రకటన చేశారు. 32 ఏళ్ల క్రితం తమ కుటుంబం ఊరు విడిచి వెళ్లినా.. ఇక్కడి మట్టితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక మెరిట్ స్కాలర్‌షిప్స్ అందిస్తామని ఆనాడు విజయ్-రష్మిక హామీ ఇచ్చారు.సొంతూరులో ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకుంటూ.. సరిగ్గా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి ఈ స్టార్ దంపతులు తమ హామీని నిజం చేశారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో 9వ, 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, మొదటి, ద్వితీయ స్థానాలు సాధించిన టాపర్ల వివరాలను ఫౌండేషన్ సభ్యులు సేకరించారు. ఆ వడపోత ప్రక్రియ పూర్తి చేసి.. తాజాగా స్కాలర్‌షిప్‌నకు అర్హత సాధించిన మొత్తం 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల అధికారిక తుది జాబితాను ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా విజయ్, రష్మిక దంపతులు విడుదల చేశారు.ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి కూడా తన చదువును మధ్యలోనే ఆపేయకూడదనే ఉద్దేశంతోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈ దంపతులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఎంపికైన ఈ 180 మంది విద్యార్థుల తదుపరి ఉన్నత చదువులకు అయ్యే కాలేజీ ఫీజులు, పుస్తకాలు, ఇతరత్రా విద్యా సంబంధిత పూర్తి ఖర్చులను తామే స్వయంగా భరిస్తామని విజయ్-రష్మిక దంపతులు వెల్లడించారు. ఈ కొత్త దంపతులు తమ జీవితంలోని అత్యంత మధురమైన ఘట్టాన్ని పురస్కరించుకుని గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు ఇలా బంగారు బాటలు వేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులకు వారి ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సినిమా రంగుల ప్రపంచానికే పరిమితం కాకుండా.. తమ సొంతూరు రుణం తీర్చుకుంటూ రియల్ హీరోలుగా నిలిచిన విజయ్ దేవరకొండ, రష్మికలపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.