సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్, ఇతర ఆఫర్ ప్రకటనలను నమ్మి డబ్బులు పెట్టుబడులు పెట్టి.. మోసపోతున్నవారిని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సైబర్ మోసాల పట్ల పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌ నగరంలో ఉండే ఓ ప్రభుత్వ ఉద్యోగి.. ఆన్‌లైన్ పెట్టుబడులు పెట్టి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని దారుణంగా మోసపోయాడు. ఈ సైబర్ మోసంలో అతడు ఏకంగా రూ.2.22 కోట్లు కోల్పోయాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలోని సనత్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో అధిక లాభాలు వస్తాయని హామీ ఇచ్చే పెట్టుబడి ప్రకటనలను చూశాడు. అతడు ఆ యాడ్‌పై క్లిక్ చేయడంతో.. కొంతమంది సైబర్ నేరగాళ్లు అతడిని సంప్రదించారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో పెట్టుబడులు పెడితే బాగా లాభాలు వస్తాయని నమ్మబలికారు. ఈ క్రమంలోనే తమను తాము ఆర్థిక నిపుణులు, మార్కెట్ విశ్లేషకులుగా పరిచయం చేసుకున్న.. సైబర్ మోసగాళ్లు.. బాధితుడిని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. పెట్టుబడులకు సంబంధించిన సలహాలను ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఇస్తూ అతడిని పూర్తిగా నమ్మించేశారు.అయితే ఆ సైబర్ నేరగాళ్ల మాటలను పూర్తిగా నమ్మిన ఆ ప్రభుత్వ ఉద్యోగి పలు దఫాలుగా భారీ మొత్తంలో ఆ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో పెట్టుబడులు పెట్టాడు. ఈ క్రమంలోనే మోసగాళ్లు సూచించిన వివిధ బ్యాంక్ అకౌంట్లకు పలు ట్రాన్సాక్షన్ల ద్వారా మొత్తం రూ.2.22 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇక అతడు పెట్టిన పెట్టుబడి కి భారీగా లాభాలు వస్తున్నాయని అతడికి నమ్మకం కలిగించేందుకు.. నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ డ్యాష్‌బోర్డ్‌లో అతని అకౌంట్‌లో దాదాపు రూ.3.1 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించారు. అది చూసి.. తన పెట్టుబడులకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చినట్లు భావించిన ఆ బాధితుడు.. ఇంకా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు.ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో ఆ డబ్బు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు ఆ ప్రభుత్వ ఉద్యోగి ప్రయత్నించాడు. అప్పుడే ఆ సైబర్ మోసగాళ్లు ట్యాక్స్‌లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీల పేరుతో మరికొంత డబ్బులు చెల్లించాలని అతడిని డిమాండ్ చేశారు. దీంతో అతడికి మోసపోయానని అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే అతడు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో వచ్చే పెట్టుబడి ప్రకటనల విషయంలో అలర్ట్‌గా ఉండాలని.. అధిక లాభాలు ఇస్తామని ఇచ్చే హామీలను నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని పోలీసులు సూచించారు.