పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం కోనూరులోని పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కోనూరులో జరిగిన ఓ వేడుకకు పదిమంది పడవపై వెళ్లి హాజరయ్యారు. వేడుక పూర్తి అయిన తర్వాత తిరిగి అదే పడవలో తిరుగుపయనమయ్యారు. అయితే అనుకోని రీతిలో పడవ బోల్తాపడటంతో పది మంది కృష్ణా నదిలో పడిపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆరుగురిని రక్షించారు. నలుగురు గల్లంతు కాగా.. వీరిలో ముగ్గురు చనిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులతో కలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో కోనూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన ముగ్గురూ కూడా చిన్నారులే కావటం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఈ దుర్ఘటనలో 9 ఏళ్ల గంధం సంధ్య, పదేళ్ల గంధం సైనీ, 12 ఏళ్ల బత్తుల కార్తీక్ చనిపోయారు. కొనత చైతన్య అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇసుక కోసం నదిలో తవ్విన గుంతలే పడవ ప్రమాదానికి కారణమనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇలాంటి తవ్వకాలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి..మరోవైపు పల్నాడు జిల్లాలో పడవ ప్రమాద ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గల్లంతైన వారిని కాపాడేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జగన్ కోరారు. సహాయక బృందాలు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గాలింపు చర్యలు వేగవంతం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని.. ఆర్థిక సాయం అందించి వారిని ఆదుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.