నెల్లూరు జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.. కోవూరు నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైఎస్సార్‌సీపీ వార్ మరింత ముదిరింది. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రశాంతి రెడ్డిని సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అంటూ ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా.. ప్రసన్నకు ప్రశాంతిరెడ్డి కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రసన్నకుమార్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని.. అవును తాను మొదటి సోమిరెడ్డి ప్రశాంతిరెడ్డినే అన్నారు. తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటిపేరు మారిపోయిందన్నారు. తాను ఎన్నికల సమయంలో బహిరంగంగానే ఈ విషయాన్ని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి 55వేల మెజార్టీతో గెలిపించారని.. నల్లపరెడ్డి ప్రసన్నను ప్రజలు తరిమికొట్టారన్నారు ప్రశాంతి రెడ్డి. ఆరు సార్లు ఎమ్మెల్యేనని చెప్పుకునే వ్యక్తిని 25 రోజుల్లో ఓడించానన్నారు. అవినీతి పరులు జీవితాంతం ‘మాజీ’లుగానే మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ప్రసన్నకు మాజీ ట్యాగ్‌ పోదు.. పోనివ్వను.. ఈ వానే సాక్షి అంటూ సవాల్ చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. వాళ్లను వదిలిపెట్టేది లేదన్నారు. మహిళలకు మర్యాద ఇవ్వనివారు రాజకీయాల్లో కొనసాగే అర్హత కూడా లేదన్నారు. మహిళల్ని కించపరిచే నేతల్ని ప్రజలే తరిమికొడతారన్నారు. ప్రతిపక్ష పార్టీలోని నేతలు మహిళల్ని అవమానించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కోవూరు అభివృద్ధికి రూ.721.25 కోట్లతో పనులు చేపట్టామన్నారు.అంతకముందు పై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గత ప్రభుత్వ అభివృద్ధి చేయలేదని, తట్టెడు మట్టి వేయలేదని మాట్లాడుతున్నారని.. ఆమె గతంలో రేణిగుంటలో మెస్ నడిపే సమయంలో తట్టల వ్యాపారం చేశారేమో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు ఆమెను ఎమ్మెల్యేను చేశాయని.. వీళ్లంతా ఎమ్మెల్యేలు, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వారు కాదని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఏం అభివృద్ధి చేశామో ప్రశాంతిరెడ్డి ఆమె భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. తాము రౌడీయిజం చేస్తే తట్టుకోలేరన్నారు. తాము కోవూరులో బీఎల్ఓలతో సమావేశం పెట్టుకున్నామని.. అక్కడ ప్లెక్సీలు ఏర్పాటు చేస్తే రౌడీ షీటర్లు చించి వేయడం ఏం సంస్కృతి అంటూ ప్రశ్నించారు. దామరమడుగులో వంశీ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే పది మంది దాడి చేయటం సరికాదన్నారు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.