HYD: శ్మశానవాటికలో వ్యభిచారం.. జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

Wait 5 sec.

హైదరాబాద్ బేగంపేట పరిధిలోని ప్రకాష్ నగర్ డివిజన్‌లో బుధవారం కూకట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ధనియాలగుట్ట శ్మశానవాటికను అధికారులతో కలిసి ఆయన స్వయంగా సందర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ఈ వైకుంఠధామాన్ని మోడల్ శ్మశానవాటికగా ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేశారు. అయితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీస నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేయడంతో ఇది అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందన్నారు. స్థల పవిత్రతను కాపాడాల్సిన చోట ఇలాంటి దారుణాలు జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు.ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా శ్మశానవాటిక ఆవరణలో వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నాయని అంతేకాకుండా మందుబాబులకు ఇది ప్రధాన అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస నిర్వహణ, భద్రత లేకపోవడంతో తాము ఆ పరిసరాల్లో తిరగడానికే భయపడుతున్నామని వివరించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. అక్కడి నుంచే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. శ్మశానవాటిక దుస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తక్షణమే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడ భద్రతను పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు.ధనియాలగుట్ట పర్యటన అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శ్యామలాల్ బిల్డింగ్ పరిధిలో ఉన్న బస్తీ దవాఖానాను సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అక్కడి సిబ్బందికి సూచించారు. ఆ తర్వాత ప్రకాష్ నగర్‌లో ఏర్పాటు చేసిన స్థానిక నివాసితుల సమావేశంలో అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి వివిధ పౌర సమస్యలపై రాసిన వినతిపత్రాలను ఎమ్మెల్యేకు సమర్పించారు. వాటన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.పరిపాలనాపరమైన మార్పుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే మాధవరం ప్రస్తావించారు. గతంలో హైదరాబాద్ పరిధిలో ఉన్న బేగంపేట డివిజన్‌ను ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలోకి మార్చటం వల్ల స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.