డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్, హైపర్‌స్కేల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతకు డిమాండ్ శరవేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ దేశీయ సంస్థ CtrlS డేటా సెంటర్స్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్ కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (CPP) ముందుకు వచ్చింది. మొత్తం రూ.7 వేల కోట్ల భారీ పెట్టుబడిని అందించేందుకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. భారతదేశ డిజిటల్ ప్రగతిలో ఈ ఒప్పందం అత్యంత కీలకమైన మైలురాయిగా నిలవనుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా.. సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇప్పటికే రూ.4 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టి CtrlS సంస్థలో 8.2 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకుంది. ఈ లావాదేవీ సమయంలో CtrlS కంపెనీ యొక్క ప్రీ-మనీ వాల్యుయేషన్ రికార్డు స్థాయిలో రూ.44,914 కోట్లుగా లెక్కించారు. ఈ వాటా కొనుగోలు నిధులకు అదనంగా.. మరో రూ.3 వేల కోట్ల నిధులను భారతదేశవ్యాప్తంగా అత్యాధునిక హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌లను ఉమ్మడిగా అభివృద్ధి చేయడానికి ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు కోసం వినియోగించనున్నారు.ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంపై CtrlS వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ పిన్నపురెడ్డి స్పందిస్తూ.. భారతదేశంలో ఏఐ ఆధారిత డిమాండ్ ఒక సరికొత్త దశకు చేరుకుందని అన్నారు. అంతర్జాతీయ హైపర్‌స్కేలర్లు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి వస్తున్న డిమాండ్ సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయన్నారు. ఈ ఉమ్మడి భాగస్వామ్యం ద్వారా నిర్మించే మొదటి హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ను నవీ ముంబైలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.CtrlS సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్లానింగ్, అనుమతులు, నిర్మాణ దశలలో సుమారు 4.4 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులను కలిగి ఉంది. రాబోయే ఐదేళ్ల కాలంలో దాదాపు 5 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే.. ప్రస్తుతం 11 నగరాల్లో ఉన్న తమ కార్యకలాపాలను రాబోయే రెండు మూడు ఏళ్లలో 20 నుండి 22 నగరాలకు విస్తరించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని చందన్‌వెల్లి, ఫ్యూచర్ సిటీలలో వరుసగా 1.4 గిగావాట్లు, 2 గిగావాట్ల ప్రణాళికాబద్ధమైన సామర్థ్యాలతో రెండు భారీ క్యాంపస్‌లను నిర్మిస్తున్నారు. ఈ భారీ విస్తరణకు తగ్గట్లుగా కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 1850 నుంచి రానున్న రోజుల్లో 3 వేల మందికి పెంచేలా భారీ నియామకాలను చేపడుతోంది.