కొంతకాలంగా భారత్ - అమెరికా మధ్య అంతగా సత్సంసంధాలు లేవనే చెప్పొచ్చు. భారత్ - పాక్ ఉద్రిక్తత సమయం నుంచి ఇరుదేశాల మధ్య బంధాలు సన్నగిల్లాయి. అమెరికా - ఇరాన్ యుద్ధ సమయంలో కూడా తాజాగా భారతీయులు ఉన్న మూడు నౌకలపై యూఎస్ ఆర్మీ దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో జీ 7 సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ - ట్రంప్ జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో సమావేశం కానున్నట్లు వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. 2025లో ఈ ఇద్దరు నేతలు చివరిసారిగా సమావేశమయ్యారు. 2025 ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో జరిగిన సమావేశం తర్వాత ముఖాముఖిగా కలవడం ఇదే తొలిసారి అవుతుంది. జూన్ 13 నుంచి 18 వరకు దాదాపు వారం రోజులపాటు మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా ద్వైపాక్షిక చర్చలు, జీ7 అవుట్ రీచ్ సెషన్లలో పాల్గొంటారు. మోదీ - ట్రంప్ భేటీలో ప్రధానంగా భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు సాగే అవకాశం ఉంది. దాంతో పాటు అమెరికా - ఇరాన్ యుద్ధ పరిణామాలు, జావెలిన్ క్షిపణుల కొనుగోలు, ప్రాంతీయ భద్రతా అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ఒమాన్ సముద్ర జలాల్లో అమెరికా దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై భారత విదేశాంగ శాఖ అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయోల్ మాక్రోన్‌తో మోదీ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం‌తో పాటు మరికొన్ని అంశాలపై చర్చలు జరపనున్నారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు వెళ్లనున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు పీటర్, ప్రధాని రాబర్ట్ ఫికో‌తో మోదీ సమావేశమవుతారు. జూన్ 16-17 తేదీల్లో ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరిగే జీ7 అవుట్ రీచ్ సమావేశాల్లో భారత్ పాల్గొననుంది. బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో పాటు భారత్‌ను ఆతిథ్య దేశమైన ఫ్రాన్స్ ఆహ్వానించింది. కేవలం భారత్ తరఫునే కాకుండా గ్లోబల్ సౌత్ దేశాల తరఫున కూడా భారత్ గొంతు వినిపిస్తుందని మోదీ తెలిపారు. మొత్తానికి మోదీ జీ 7 సమ్మిట్ పర్యటన కొత్త మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.