తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Wait 5 sec.

తెలంగాణలో నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రుతుపవనాలు శనివారం నాటికి హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మీదుగా సోలాపూర్, కళింగపట్నం వరకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నేడు, రేపు (ఆది, సోమవారాల్లో) గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళ, బుధవారాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో అత్యధికంగా 11.5 సెం.మీ.ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అలాగే వనపర్తి జిల్లా రేవల్లిలో 7.3 సెం.మీ., యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో 6.7 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనూ విస్తృతంగా వానలు పడ్డాయి. రాష్ట్రంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌తో పాటు జిల్లాల్లోని ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పోలీసు, హైడ్రా, రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు శనివారం రాత్రి నుంచే చెరువులు, నాలాల ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.మరోవైపు శనివారం సాయంత్రం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. దిల్లీ, దేహ్రాదూన్ ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలను రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో బెంగళూరుకు దారి మళ్లించారు. అలాగే బెంగళూరు నుంచి వచ్చిన మరో ఇండిగో విమానాన్ని విజయవాడకు మళ్లించాల్సి వచ్చింది. ప్రతికూల వాతావరణం కారణంగా పలు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.