తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2.26 గంటల సమయంలో ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నిర్ధారించింది. భూగర్భంలో వచ్చిన శబ్దాలు, వస్తువులు కదలడంతో ఏం జరుగుతుందో తెలియక జనం భయాందోళనకు గురై ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ ప్రకంపనలు కేవలం కొన్ని సెకన్ల పాటే కొనసాగి.. ఆ తర్వాత వాతావరణం సాధారణ స్థితికి చేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి ప్రకంపనలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో డిసెంబర్ 4, 2024న ఉదయం 7:27 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో వచ్చిన మధ్యస్థాయి భూకంప కేంద్రం ఏటూరునాగారం అడవులు, మేడారానికి ఉత్తర దిశగా భూమి లోపల 40 కిలోమీటర్ల లోతులో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో ములుగు, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంప కేంద్రం లోతు ఎక్కువగా ఉండటం వల్ల అప్పుడు కూడా భారీ నష్టం తప్పింది. అంతకుముందు 1969లో భద్రాచలం పరిసరాల్లో కూడా 5.3 తీవ్రతతో భూకంపం వచ్చిన రికార్డులు ఉన్నాయి.సాధారణంగా భారత వాతావరణ, భౌగోళిక పటాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం జోన్ 2 కిందకు వస్తుంది. అంటే ఇక్కడ భూకంపాలు వచ్చే ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ భద్రాద్రి, ములుగు బెల్ట్‌లో భూకంపాలు రావడానికి ప్రధాన కారణం గోదావరి ఫాల్ట్ సిస్టమ్. భూమి లోపల ఉండే పెద్ద పెద్ద రాతి పలకల మధ్య ఉండే బలహీనమైన చీలికలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఈ గోదావరి ఫాల్ట్ లైన్ గుండా భూగర్భంలో కొన్ని వందల కిలోమీటర్ల లోతున నిరంతరం ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది.దీనికి తోడు ఇండియన్ ప్లేట్ నిరంతరం ఉత్తర దిశగా యురేషియన్ ప్లేట్ వైపు నెట్టబడుతోంది. ఈ క్రమంలో ద్వీపకల్ప భారతదేశంలో భూగర్భంలో ఉన్న పాత ఫాల్ట్ లైన్లపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భూమి కంపిస్తుంది. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ప్రకంపనలు కూడా ఈ భౌగోళిక మార్పుల ఫలితమేనని భూగర్భ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.