తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిష్ఠాత్మకమైన సత్తుపల్లి-కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టును త్వరితగతిన పట్టాలెక్కించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రైల్వే బోర్డును కోరింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల రైల్వే శాఖకు భారీగా ఆదాయం సమకూరుతుందని, వ్యయంతో పోలిస్తే వచ్చే రాబడి 14 శాతానికి పైగానే ఉంటుందని ఏపీ ప్రభుత్వం తాజా నివేదికలో స్పష్టం చేసింది. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టుకు ఎఫ్‌ఐఆర్‌ఆర్‌ 10 శాతానికి పైగా ఉంటేనే రైల్వే శాఖ లాభసాటిగా భావిస్తుంది. ఈ ప్రాజెక్టుకు అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి వాటా ఆశించకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే దీనిని నిర్మించాలని ఏపీ ప్రభుత్వం రైల్వే బోర్డు ముందు ప్రతిపాదించింది.నిజానికి భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుంచి కొవ్వూరు వరకు రైల్వే లైన్ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మంజూరైంది. అప్పట్లో ఈ ప్రాజెక్టు వ్యయంలో సగం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని రైల్వే శాఖ షరతు విధించింది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు నిధులు వెచ్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాలేదు. మరోవైపు సింగరేణి కాలరీస్ గనుల నుంచి బొగ్గు రవాణాను సులభతరం చేసేందుకు తెలంగాణ పరిధిలోని భద్రాచలం రోడ్ నుంచి సత్తుపల్లి వరకు ఇప్పటికే రైల్వే లైన్ నిర్మించారు. ఇప్పుడు సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు మిగిలిన 118.9 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మిస్తే ఈ కీలక అనుసంధానం పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం వివరిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్గంలో ఏపీ పరిధి 70.31 కిలోమీటర్లుగా ఉంది.ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో ఏపీ ప్రభుత్వం సగం నిధులు ఇవ్వాలని లేదా కనీసం భూసేకరణ వ్యయాన్నైనా భరించాలని రైల్వే శాఖ గతంలో పట్టుబట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ ప్రాజెక్టును కేంద్రమే చేపడుతుందని స్పష్టమైన హామీ ఉన్నందున.. రైల్వే శాఖే పూర్తి నిధులు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ లైన్ సాకారమైతే కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లోని సింగరేణి గనుల నుంచి సేకరించే బొగ్గును కాకినాడ పోర్టుకు తరలించడానికి రైలు మార్గంలో సుమారు 140 కిలోమీటర్లకు పైగా దూరం తగ్గుతుంది. దీనివల్ల రవాణా ఖర్చులు భారీగా తగ్గడమే కాకుండా... సమయం కూడా ఆదా అవుతుంది. పారిశ్రామికంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణతో పాటు అన్ని రకాల పరిపాలనాపరమైన సహకారం అందిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.