తెలంగాణలో ప్రస్తుతం స్కూళ్లకు వేసవి సెలవులు పూర్తి అయ్యాయి. దీంతో సోమవారం నాడు.. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఇవాళ కావడంతో.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించలేదు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అమావాస్య రావడంతో.. తమ పిల్లలను పంపించేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో మొదటిరోజే స్కూళ్లలో పిల్లలు చాలా తక్కువగా కనిపించారు. దీంతో అమావాస్య ఎఫెక్ట్.. విద్యార్థులపై బాగానే పడిందంటూ స్కూల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక రేపు మంగళవారం కూడా కావడంతో.. ఎల్లుండి నుంచి స్కూళ్లకు విద్యార్థులు వస్తారని భావిస్తున్నారు. సాధారణంగా అమావాస్య రోజున ఏదైనా పని మొదలుపెట్టడానికి చాలా మంది ఇష్టపడరు. పైగా పిల్లల చదువులు, అది కూడా తొలిరోజే అమావాస్య రావడంతో.. స్కూళ్లకు పంపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చాలా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు కూడా అమావాస్య రోజునే స్కూళ్లలో అడుగుపెట్టడం ఇష్టం లేక వెళ్లలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అమావాస్య పక్కనపెడితే కొంతమంది మంగళవారం రోజున కూడా పనులు మొదలుపెట్టరు. దీంతో రేపు కూడా స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్‌లో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో ఇవాళ పదో తరగతి విద్యార్థిని ఒక్కతే స్కూల్‌కు రావడం గమనార్హం. అయితే ఆ క్లాస్‌లో ఎవరూ రాకపోవడంతో ఆ ఒక్క విద్యార్థే.. ఒంటరిగా క్లాస్‌‌రూంలో ఉండిపోయింది. దీంతో అధికారులు, ప్రభుత్వం.. అమావాస్యను దృష్టిలో పెట్టుకుని.. స్కూళ్ల పునఃప్రారంభ తేదీని కొద్దిగా ముందో తర్వాతో ఇవ్వాల్సి ఉందని.. తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అయితే ఇలా అమావాస్య వస్తుందని ముందుగానే గుర్తించిన చాలా ప్రైవేటు స్కూళ్లు.. శుక్రవారం (జూన్ 12), శనివారం (జూన్ 13) రోజుల్లోనే స్కూళ్లను ప్రారంభించాయి. దీంతో వారికి ఈ అమావాస్య ఎఫెక్ట్ లేకుండా.. విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.