తెలంగాణ అమరవీరులంటే అందుకే నాకు గౌరవం.. 12 ఏళ్లు సరిపోలేదా.. పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు

Wait 5 sec.

తెలంగాణ నేతలపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జూన్ 2వ తేదీ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదలైన ఈ మాటల యుద్ధం.. రోజురోజుకూ తీవ్రం అవుతోంది. ఇవాళ ఢిల్లీలో సేన ప్రస్థానం సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్.. తెలంగాణ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించేందుకు తాను హైదరాబాద్ బయలుదేరితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనకు పర్మిషన్‌ ఇవ్వలేదని పవన్‌ కళ్యాణ్‌ మండిపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించేందుకు హైదరాబాద్‌కు వెళ్లొద్దా అని ప్రశ్నించారు. ఇండియా గేట్‌ వద్దకు వెళ్లి సైనికులకు వందనం చేయాలంటే కాశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో పుట్టాలా అని ప్రశ్నించారు. తెలంగాణ తనకు స్ఫూర్తినిచ్చిన నేల అని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 1200 మంది ప్రజలు అమరులు అయ్యారని తేల్చి చెప్పారు. ఒక నేల కోసం ఇంతమంది ఇలా ఆత్మబలిదానాలు చేసుకుంటారా అని అనిపించిందని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ అమరవీరులు అంటే తనకు ఎనలేని గౌరవం అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ యువతను బలిచేసి.. రాజకీయ నాయకులు గద్దెనెక్కి పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లు అయిందని.. ఇన్నేళ్లు ఇంకా వారిని గుర్తింపునకు సరిపోలేదా అని ప్రశ్నించారు. ఎలాంటి ఆశయాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో.. దానికోసం జనసేన పార్టీ తన వంతు కృషి చేస్తుందని మనస్ఫూర్తిగా మాటిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. జనసేన పార్టీకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంటుందని.. జనసేన నేతలు, కార్యకర్తలు నిలబడాలి అని పవన్‌ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే తెలంగాణ తన నేల కాదా అని.. ఇది తన దేశం కాదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన బలిదానాలు తనను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్నారు. తెలంగాణ అమరుల ప్రాణత్యాగాలను ఎన్నేళ్లకు గుర్తిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ అమరుల గౌరవార్థం హైదరాబాద్‌లో సభ పెట్టేందుకు అనుమతి అడిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. అమరుల నివాళులకు కూడా అనుమతి కావాలా అని నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. 12 ఏళ్లు పోరాటం చేస్తున్నామని.. క్రిమినల్ పార్టీలతో తాము పోరాడినట్లు వైసీపీ ఉద్దేశించి పరోక్షంగా పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు.