రెండు తెలుగు రాష్ట్రాలలో బడి గంట మోగింది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల బస్సులలో భద్రతా ప్రమాణాలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల బస్సులపై నిర్వహించిన తనిఖీల్లో, భారీ సంఖ్యలో వాహనాలు భద్రత, ఫిట్‌నెస్ పరమైన లోపాలతో నడుస్తున్నట్లు వెల్లడైంది. దీంతో బడి పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4,011 విద్యాసంస్థలు.. 17,916 బస్సులను నడుపుతున్నాయి. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,440 బస్సులను పరిశీలించారు.ఈ తనిఖీల్లో 6,616 బస్సులు వినియోగానికి అనుకూలంగా ఉన్నట్లు తేలగా.. 2,824 బస్సులలో వివిధ లోపాలు. భద్రతకు సంబంధించిన సమస్యలను గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా లెక్కలను పరిశీలిస్తే కోనసీమ జిల్లాలో అత్యధికంగా 1702 పాఠశాలలు, విద్యాసంస్థల బస్సులు నడుస్తున్నాయి. ఆ తర్వాత 1642 బస్సులతో కాకినాడ జిల్లా రెండో స్థానంలో ఉంది. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా కోనసీమ జిల్లాలో అత్యధికంగా 1112 బస్సులను పరిశీలించారు. అయితే కొన్ని జిల్లాలలో తనిఖీలు పూర్తి స్థాయిలో చేపట్టలేదు. కృష్ణా జిల్లాలో మొత్తం 773 రిజిస్టర్డ్ స్కూల్ బస్సులు ఉండగా.. వీటిలో కేవలం 251 మాత్రమే తనిఖీ చేశారు. అలాగే అనకాపల్లి జిల్లాలోనూ 521 బస్సులకు గానూ 298 మాత్రమే పరిశీలించారు. గుంటూరు జిల్లాలో 808 బస్సులు ఉంటే అందులో సగం 403 బస్సులను తనిఖీ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విద్యాసంస్థలకు చెందిన బస్సుల తనిఖీలలో భాగంగా వాహన ఫిట్‌నెస్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్, అగ్నిమాపక భద్రతా పరికరాలు, స్పీడ్ గవర్నర్లు, పర్మిట్లు, బీమా కవరేజ్. విద్యార్థుల రవాణా భద్రతా నిబంధనలను పరిశీలిస్తున్నట్లు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శివరామ్ ప్రసాద్ తెలిపారు. బస్సులలో ఏవైనా లోపాలను గుర్తిస్తే వాటిని సరిదిద్దాలని ఆదేశించినట్లు వెల్లడించారు. మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల బస్సులను క్షేత్రస్థాయిలో పరిశీలించామన్న ఆయన.. పాఠశాలలు తిరిగి తెరుచుకున్న నేపథ్యంలో ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోందన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ప్రయాణానికి అనర్హమైనవిగా తేలిన బస్సులను విద్యార్థుల రవాణాకు ఉపయోగిస్తున్నారా అనే విషయాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. తనిఖీ సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలిన బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు భద్రతా ప్రమాణాలను పాటించని బస్సులు ఈ స్థాయిలో ఉన్నాయన్న గణాంకాలు.. విద్యార్థుల తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. ఇది స్కూలు యాజమాన్యాల అలసత్వమా.. లేక అధికారులు చర్యలపై అలుసా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.