భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) షెడ్యూల్‌లో కీలక మార్పు చేయాలని భావిస్తోంది. 2027 సీజన్ నుంచి టోర్నమెంట్‌ను కాస్త ముందుగానే ప్రారంభించాలని యోచిస్తోంది. ఎండలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఆటగాళ్లు, అభిమానులు ఇబ్బంది పడటంతో పాటు.. మ్యాచ్ నిర్వహణ కూడా కష్టంగా మారుతోందని బీసీసీఐ భావిస్తోందట. అందుకే కాస్త ముందుగానే సీజన్ ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం.సాధారణంగా అయితే మార్చి చివరి నుంచి మే చివరి వరకు ఉండే ఐపీఎల్ షెడ్యూల్ ఉంటుంది. ఐపీఎల్ 2026 షెడ్యూల్ సైతం.. దానిని ఇకపై మార్చి 10 నుంచి మే 15 మధ్యకు మార్చేందుకు చర్చలు జరుగుతున్నాయని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. అన్నీ అనుకున్నట్లు సాగితే 2027 ఐపీఎల్ సీజన్‌.. మార్చి రెండో వారంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.షెడ్యూల్‌ మార్పు ఎందుకంటే..దేశంలోని అనేక ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రుతుపవనాల రాకకు ముందు కురిసే వర్షాల కారణంగా ఐపీఎల్‌లో చివరి మ్యాచ్‌లు ప్రభావితం అవుతున్నాయని దేవజిత్ సైకియా పేర్కొన్నారు. “ఈ సంవత్సరం ఐపీఎల్‌ మార్చి 28న మొదలై మే 31 నాటికి ముగిసింది. అయితే, మే 15 తర్వాత టోర్నమెంట్ చివరి దశలో వర్షాలు పడే లేదా రుతుపవనాల సీజన్ మొదలయ్యే అవకాశం ఉందనే ఆందోళన ఉంది. మరోవైపు, తీవ్రమైన వేడి వాతావరణం ఆటగాళ్లకు గానీ, ప్రేక్షకులకు గానీ అనుకూలంగా ఉండదు. అందుకే టోర్నీని 2 వారాలు ముందే ప్రారంభించాలని బోర్డు భావిస్తోంది. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో చర్చ జరుగుతోంది” అని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు.మ్యాచ్‌ల సంఖ్యను పెంచుతారా?“ప్రస్తుతానికైతే ఐపీఎల్‌లో మ్యాచ్‌ల సంఖ్య పెంచడం అనేది సాధ్యం కాదు. 74 మ్యాచ్‌ల ఫార్మాట్‌ను విస్తరించే ప్రణాళికులు ఇప్పుడు లేదు. ఎందుకంటే వివిధ దేశాల నుంచి వచ్చే ఆటగాళ్లకు సంబంధించిన అనేక అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతో కష్టపడితేనే ఐపీఎల్‌ కోసం రెండు నెలల విండో దొరుకుతోంది. అంతకుమించి ఎక్కువ సమయం కేటాయించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇతర దేశాలు కూడా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. బట్టి, మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచే విషయంపై ప్రస్తుతం ఎలాంటి చర్చా జరగట్లేదు” అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.